పశువుల రవాణాను అడ్డుకున్నందుకు కారుతో ఢీకొట్టి రాడ్లతో దాడి.. నలుగురు అరెస్ట్

పశువుల రవాణాను అడ్డుకున్నందుకు కారుతో ఢీకొట్టి రాడ్లతో దాడి.. నలుగురు అరెస్ట్

హసన్‌‌‌‌పర్తి, వెలుగు: చింతూరు నుంచి జహీరాబాద్‌‌‌‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాను కాకతీయ యూనివర్సిటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు రూ.20 లక్షల విలువైన 89 ఆవులను స్వాధీనం చేసుకుని ధర్మసాగర్ గోశాలకు తరలించారు. కేయూ సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ మహమ్మద్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన మహమ్మద్ ఇబ్రాహీం కూరేషీ, సంగారెడ్డి జిల్లా కోహీర్‌‌‌‌కు చెందిన షేక్ వాడ మహమ్మద్ ఇర్ఫాన్, చిద్గిద్దె వాలే అలియాస్ మహమ్మద్ ముకీద్ పశువుల వ్యాపారం చేస్తుంటారు. 

వీరితో పాటు డ్రైవర్లు షేక్ అబ్దుల్ అర్షద్, దేవేందర్ సింగ్ కలిసి గత కొంతకాలంగా పశువులను అక్రమంగా రవాణా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నెలలో బక్రీద్ పండుగ ఉండడంతో చింతూరు సంతలో రెండు ఆవులు, 87 ఎద్దులను కొనుగోలు చేసి కంటైనర్‌‌‌‌లో ఎక్కించి జహీరాబాద్ మార్కెట్‌‌‌‌కు తీసుకెళ్తున్నారు. నిందితులు మరో కారులో ఉన్నారు. 

చింతూరు నుంచి భద్రాచలం, ఇల్లందు, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ మీదుగా వెళ్తుండగా జనగామ బ్రిడ్జి వద్ద కొందరు అనుమానంతో కంటైనర్‌‌‌‌ను వెంబడించారు. వెంబడిస్తున్న కారును నిందితులు ఢీకొట్టే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించిన కారును ఢీకొట్టి, అందులో ఉన్న వ్యక్తులపై రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. 

అనంతరం కంటైనర్‌‌‌‌ను వదిలి వరంగల్ వైపు కారులో పారిపోయారు. ఈ ఘటనపై బానవత్ నాగ అనే వ్యక్తి కేయూ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి సోమవారం గిర్నిబావి వద్ద నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 89 ఆవులు, కంటైనర్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.