దత్తన్నపై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల యత్నం

దత్తన్నపై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల యత్నం

హిమాచల్​ప్రదేశ్ బడ్జెట్ సెషన్ సందర్భంగా ఘటన
సభ నుంచి వెళ్తుండగా అడ్డుకున్న కాంగ్రెస్ సభ్యులు
ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

న్యూఢిల్లీ, వెలుగు: హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు. బడ్జెట్ స్పీచ్ ముగించుకొని బయటకు వస్తుండగా, ఆయనను అసెంబ్లీ కాంప్లెక్స్ లో ఘెరావ్ చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యత్నించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన కారును అడ్డుకునేందుకు యత్నించారు. ఒక దశలో గవర్నర్​పై దాడికి ప్రయత్నించారు. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా ఉదయం 11 గంటలకు దత్తాత్రేయ సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు అసెంబ్లీకి వచ్చారు. స్థానిక ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను తన స్పీచ్ లో వినిపిస్తుండగా.. ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన స్పీచ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల అంశాన్ని, రైతుల సమస్యలను బడ్జెట్ ప్రసంగంలో చేర్చలేదని, బడ్జెట్ స్పీచ్ అంతా అబద్ధాల పుట్ట అని ఆరోపించారు. గవర్నర్ చుట్టూ చేరి సభలో గందరగోళం సృష్టించారు. దీంతో స్పీచ్ లోని చివరి లైన్స్ ని మాత్రమే చదివి ప్రసంగాన్ని ముగించిన దత్తాత్రేయ.. అసెంబ్లీ హాల్ నుంచి బయల్దేరారు. బయటకు వచ్చిన ఆయనను అసెంబ్లీ కాంప్లెక్స్ ఏరియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్షల్స్, సెక్యూరిటీ సిబ్బంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలువరించారు. గవర్నర్ వెంట వచ్చిన హిమాచల్ సీఎం జయరాం ఠాకూర్, స్పీకర్ పర్మార్..  కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో సీఎం నేరుగా గవర్నర్ వెహికల్ కు దారి క్లియర్ చేసేందుకు యత్నించారు. సెక్యూరిటీ సాయంతో గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఐదుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను సీఎం ఖండించారు. దూకుడుగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం సభ తిరిగి సమావేశం కాగానే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సురేశ్ భరద్వాజ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ప్రతిపక్ష నేత ముఖేశ్ అగ్నిహోత్రితో పాటు హర్షవర్ధన్ చౌహాన్, సత్పాల్ సింగ్ రైజాడ, సురేందర్ సింగ్, వినయ్ కుమార్ లను బడ్జెట్ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్​ను ఆ పార్టీ ఖండించింది.