కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తలా తన 55వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. సాధారణంగా హీరోలు తమ బర్త్‌డే రోజున కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇస్తుంటారు, కానీ అజిత్ తన ప్యాషన్ అయిన మోటార్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ‘గ్లాడియేటర్స్: ఇన్ పర్సూట్ ఆఫ్ ఛాలెంజెస్’ (Gladiators - In Pursuit of Challenges) అనే అద్భుతమైన డాక్యుమెంటరీ టీజర్‌ను విడుదల చేశారు.
హీరో నుంచి రేసర్‌గా..
సుమారు 50 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒక యానిమేటెడ్ సీక్వెన్స్‌తో మొదలయ్యే ఈ టీజర్‌లో.. రేస్ కార్ అరీనాలోకి దూసుకురావడం, అజిత్ పూర్తి రేసింగ్ గేర్ ధరించి, హెల్మెట్ చేతపట్టుకుని గంభీరంగా నడిచిరావడం తెగ ఆకట్టుకుంది. ఒక నటుడి నుంచి అంతర్జాతీయ స్థాయి రేసర్‌గా ఆయన సాగించిన ప్రయాణం, లక్ష్యం కోసం ఆయన పడ్డ శ్రమను ఈ టీజర్‌లో చూపించారు. ఈ డాక్యుమెంటరీని నేరుగా థియేటర్లలోనే విడుదల కానుంది. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
టాప్ టెక్నీషియన్స్ తో ..
ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. అజిత్ రేసింగ్ ఈవెంట్స్ అన్నింటిలో విజయ్ స్వయంగా పాల్గొని ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ఇక దీనికి మెలోడీ కింగ్ జి.వి. ప్రకాష్ కుమార్ పవర్‌ఫుల్ సంగీతాన్ని అందించారు. రేసింగ్ ట్రాక్‌పై వినిపించే ఇంజిన్ సౌండ్స్‌కు దీటుగా ఉండే అదిరిపోయే థీమ్ స్కోర్‌ను ఆయన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ALSO READ : రామ్ చరణ్ 'పెద్ది'తో మహేష్ బాబు బ్యానర్ మూవీ ఢీ! వెనక్కి తగ్గేదెవరు?
రేసింగ్ రంగంలో..
అజిత్ కేవలం సరదా కోసం రేసింగ్ చేయడం లేదు. 2024లో ఆయన 'అజిత్ కుమార్ రేసింగ్' పేరుతో సొంత టీమ్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్‌లోని సర్క్యూట్ పాల్ రికార్డ్‌లో జరిగే ప్రతిష్టాత్మక 'లె మాన్స్ కప్' (Le Mans Cup) కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తన కలల వైపు అజిత్ వేస్తున్న అడుగులు వేస్తున్నారు.
అయితే అజిత్ బర్త్ డే రోజు ఒక కొత్త సినిమా అప్డేట్ ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశను మిగిల్చింది. అయితే తన ప్యాషన్ కోసం అజిత్ పడుతున్న కష్టాన్ని వెండితెరపై చూడటానికి మెజారిటీ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. క్రమశిక్షణ, వేగం, పట్టుదలకు మారుపేరుగా మారిన అజిత్ ప్రయాణమే ఈ ‘గ్లాడియేటర్స్’ డాక్యుమెంటరీ. దీని విడుదల తేదీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు..
