జగిత్యాల జిల్లాలో మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక ఉన్నతాధికారిపై వేటు పడింది. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPO) హరీష్‌ను సర్వీసు నుంచి రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 2013 వర్క్‌ప్లేస్ హరాస్‌మెంట్ చట్టం, కాంట్రాక్ట్ నిబంధనల ఉల్లంఘన కింద హరీష్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తన వద్ద ఉన్న పూర్తి బాధ్యతలను, రికార్డులను వెంటనే జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్‌కు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు.
కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న హరీష్, తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. కేవలం హరాస్‌మెంట్ మాత్రమే కాకుండా.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అటెండెన్స్ రికార్డులను ఇష్టానుసారంగా మార్చడం, ఉద్యోగులతో బలవంతంగా పనులు చేయించడం వంటి అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై లోకల్ కంప్లైంట్స్ కమిటీ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హరీష్‌పై వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. గతంలోనే ఆయన ప్రవర్తనపై హెచ్చరికలు జారీ చేసినా మార్పు రాకపోవడంతో.. చివరికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
