
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చూపిస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో ఐదుగురు బౌలర్లు బుధవారం (జూలై 16) ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్- 10లో చోటు దక్కించుకోవడం విశేషం. మొన్నటి వరకు కంగారూల తుది జట్టులో స్థానం సంపాదించుకోలేని స్కాట్ బోలాండ్ కూడా టాప్-10 కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. కమ్మిన్స్, హేజాల్ వుడ్, బోలాండ్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్ టాప్-10 లో ఉన్నారు. ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ 838 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కమ్మిన్స్ టెస్టుల్లో గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. కెప్టెన్సీతో పాటు బౌలింగ్ లోనూ సత్తా చూపిస్తున్నాడు.
కమ్మిన్స్ తర్వాత మరో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో ఉన్నాడు. హేజల్ వుడ్ ఖాతాలో ప్రస్తుతం 815 పాయింట్లు ఉన్నాయి. స్కాట్ బోలాండ్ ఏకంగా ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. ఈ ఏడాది ప్రారంభంలో టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యత్తంగా రాణించిన స్కాట్.. ఇటీవలే వెస్టిండీస్ పై జరిగిన చివరి టెస్టులో తుది జట్టులో స్థానం సంపాదించి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బోలాండ్ హ్యాట్రిక్ తో చెలరేగాడు. దీంతో పింక్ బాల్ టెస్ట్ లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. జస్టిన్ గ్రీవ్స్, షమర్ జోసెఫ్, జోమెల్ వారికన్‌లను వరుస బంతుల్లో బోలాండ్ ఔట్ చేశాడు.
ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ 769 పాయింట్లతో 8 ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. దశాబ్ద కాలంగా ఆసీస్ జట్టులో లియాన్ ఏకైక స్పిన్నర్ గా కొనసాగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. యార్కర్ల వీరుడు మిచెల్ స్టార్క్ పదో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన చివరి టెస్టులో స్టార్క్ తన బౌలింగ్ తో విజృంభించి కేవలం 15 బంతుల్లోనే ఐదు వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ 5 వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా అగ్ర స్థానంలో ఉండగా రబడా రెండో ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. హెన్రీ(7), నోమన్ అలీ(5), మార్కో జాన్సెన్(9) టాప్-10 లో ఉన్న ఆటగాళ్లు.