టీచర్ల ప్రమోషన్లపై అయోమయం

టీచర్ల ప్రమోషన్లపై అయోమయం
  • పెండింగ్​లోనే  పీఎస్​హెచ్ఎం, లాంగ్వేజీ పండిట్ల అప్​గ్రేడ్
  • అవి చేయకుండా ముందుకు పోలేమంటున్న విద్యాశాఖ  
  • ప్రమోషన్లపై సీఎం ప్రకటనకు నేటితో రెండునెలలు  

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లపై ఇంకా అయోమయమే కొనసాగుతోంది. సమ్మర్ హాలీడేస్​లోనే టీచర్ల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు నిర్వహిస్తామని సర్కారు పెద్దలు ప్రకటించినా.. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో దాదాపు ఏడేండ్ల నుంచి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న టీచర్లలో ఆందోళన మొదలైంది. టీచర్ల ప్రమోషన్లపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసి సోమవారంతో సరిగ్గా రెండు నెలలు అవుతోంది. అయినా ప్రమోషన్లపై ఎలాంటి కదలిక కనిపించడం లేదు.  
ఏటా ఎదురుచూపులే.. 
రాష్ట్రంలో 26,050 ప్రభుత్వ బడుల్లో 1.05 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీలకు, ప్రమోషన్లకు అర్హులు. కానీ రాష్ట్రంలో చివరిసారిగా 2015లో ప్రమోషన్లు, 2018లో ట్రాన్స్​ఫర్లు జరిగాయి. అప్పటి నుంచి టీచర్ల ప్రమోషన్లకు ఏటా ఎదురుచూపులు తప్పడం లేదు. మరోపక్క సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టనున్నట్టు ప్రకటించారు. అయితే సీఎం ఆదేశాలు అమలు కావడం లేదు. మరోపక్క బదిలీలు, ప్రమోషన్లపై ఏటా టీచర్ల సంఘాలు ధర్నాలు చేయడం, త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని సర్కారు పెద్దలు ప్రకటించడం 
షరామాములుగా మారిపోయింది.  
ఈసారి పక్కా అన్నరు కానీ..   
బడుల ప్రారంభానికి ముందే టీచర్లకు బదిలీలు చేపట్టి, ప్రమోషన్లు ఇవ్వనున్నట్టు పలు సమావేశాల్లో సర్కారు పెద్దలు ప్రటించారు. స్కూళ్ల రీఓపెన్​కు ఇంకా నెలరోజుల టైమ్ మాత్రమే ఉన్నా.. ఇప్పటికీ షెడ్యూల్ కూడా రిలీజ్ కాలేదు. మరోపక్క ముందుగా మోడల్ స్కూళ్ల టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లతో పాటు కేజీబీవీ టీచర్లకు బదిలీలు చేపడతామని ఇటీవల టీచర్ల సంఘాల మీటింగ్​లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పినట్లు యూనియన్ నేతలు వెల్లడించారు. వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా రాలేదు. ఈ  ప్రక్రియ పూర్తికావాలంటే కనీసం నెలన్నర పడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం జూన్ 12 వరకూ సమ్మర్ హాలీడేస్​ ఉండగా, జూన్ 1 నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభమవుతోంది. దీంతో నెలరోజుల్లో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఆ అడ్డంకులు పోతేనే ప్రమోషన్లు 
మేనేజ్మెంట్ల వారీగా, కొత్త జిల్లాల వారీగా ప్రమోషన్లు ఇస్తామని సర్కారు ఇప్పటికే ప్రకటించింది. అయితే టీచర్ల ప్రమోషన్లకు పలు అంశాలు అడ్డంకిగా మారాయి. ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ల పోస్టులను 10 వేలకు పెంచుతామని ఇప్పటికే సర్కారు ప్రకటించింది. ఇందుకోసం 5,812 పోస్టులు అప్​గ్రేడ్ కావాల్సి ఉంది. దీనిపై సర్కారు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోపక్క లాంగ్వేజీ పండిట్, పీఈటీల అప్​గ్రేడ్​పై హైకోర్టులో కేసు ఉంది. జూన్ 17కు లాంగ్వేజీ పండిట్ల కేసు వాయిదా పడింది. అప్పటి వరకూ ప్రమోషన్లు ఇవ్వొద్దని సర్కారుకు సూచించింది. దీంతో సర్కారు హైకోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకుంటే తప్ప, ప్రమోషన్లకు అవకాశం లేదని టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు. అలాగే వేసవి సెలవుల్లోపు బదిలీలు, ప్రమోషన్లు మాత్రం సాధ్యం కాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.