సికింద్రాబాద్ కంటోన్మెంట్ బంగ్లా ఏరియాలో ..అక్రమ నిర్మాణాల కూల్చివేత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బంగ్లా ఏరియాలో ..అక్రమ నిర్మాణాల కూల్చివేత

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. శుక్రవారం ఉదయం సిఖ్‌‌ విలేజ్‌‌లోని భాంటియా ఫర్నిచర్  సమీపంలో ఉన్న బంగ్లా నంబర్​ 207/ఎ వద్ద సాగుతున్న అక్రమ నిర్మాణాలను కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది కూల్చివేశారు. మొత్తం ఐదు ఎకరాల్లో విస్తరించిన ఈ బంగ్లా 30 ఏళ్ల క్రితం సురేందర్ భాటియా, సునీల్ భాటియా లీజుకు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 

బోర్డు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో పాటు వాటిని ఇతరులకు సబ్‌‌ లీజుగా ఇచ్చి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో బోర్డు కోర్టును ఆశ్రయించగా, బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నిర్మాణాలను తొలగించాలని ఆక్రమణదారులకు ముందస్తు నోటీసులు ఇచ్చారు.

 అయినా స్పందించకపోవడంతో అధికారులు శుక్రవారం ఉదయం 6.30 నుంచే కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమ నిర్మాణాల్లో ఉన్న సామగ్రిని తరలించాక చర్యలు తీసుకున్నారు. సీఈవో అరవింద్‌‌కుమార్ త్రివేది ఆదేశాల మేరకు అధికారులు ఫణికుమార్, ఉమాశంకర్, దేవేందర్ పర్యవేక్షణలో కూల్చివేతలు కొనసాగాయి.