- ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ కన్వీనర్ వెంకటేశం
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో సీఎన్జీ గ్యాస్ కొరతతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం తెలిపారు. పెరిగిన ఎల్‌పీజీ ధరలు, సీఎన్జీ కొరతను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నారాయణగూడ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ.. ప్రైవేట్ బంకుల్లో రూ.60 ఉన్న సీఎన్జీ ధరను రూ.వందకు పెంచారని, గ్యాస్ కోసం ఐదారు గంటల పాటు లైన్లో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్‌లో అనేక హోటళ్లు కూడా మూతపడినట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని గ్యాస్ కొరతను నివారించాలని, ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద వేలాది మంది ఆటో డ్రైవర్లతో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి.ప్రవీణ్, ఎ.సత్తిరెడ్డి, సలీం, శ్రీకాంత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
