- బ్రిడ్జి కింద కొనఊపిరితో దొరికిన వైనం
- ఆస్పత్రికి తరలింపు
భద్రాచలం, వెలుగు : తన చావుకు ముగ్గురు మహిళలు కారణం అంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టి ఆటో డ్రైవర్ అదృశ్యమైన ఘటన మంగళవారం భద్రాచలంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని మనుబోతుల చెరువు వద్ద డబుల్ బెడ్రూంలో ఉంటున్న ఆశీర్వాదం ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ముగ్గురు మహిళలు తనను తరుచూ వేధిస్తున్నారంటూ గోదావరి బ్రిడ్జి పైనుంచి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి కన్పించకుండా పోయాడు.
ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆటోను టౌన్ స్టేషన్కు తరలించారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, గోదావరి వంతెన కింద ఇసుకలో కొన ఊపిరితో ఆశీర్వాదం కన్పించారు. వెంటనే అతడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆశీర్వాదం భార్య కూడా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, కొంతకాలంగా ఇంటికి రావడం లేదని వీడియోలో ఆమె పేర్కొన్నారు. తన భర్త సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్లు ముగ్గురు యువతులకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
