- రెట్రోఫిట్మెంట్కు ఆటోకు రూ.1.50 లక్షలు సాయం చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆటో కార్మికుల సంక్షేమం కోసం త్వరలోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సోమవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆటో యూనియన్ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆటో కార్మికుల సమస్యలపై ఇప్పటికే కేబినెట్లో చర్చించామని మంత్రి చెప్పారు. త్వరలో రవాణా, కార్మిక శాఖ అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ఇందుకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే వారికి ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని పొన్నం చెప్పారు. ఆటో ఛార్జీలు పెంచాలన్న కార్మికుల డిమాండ్‌పైనా ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనదు..
ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుందన్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా ఆర్టీసీకి ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. ఆర్టీసీ, రైల్వే, మెట్రోను అనుసంధానం చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
