ఇంటి నుంచి బయటకు రావొద్దని కరోనాపై ఊరూరా దండోరా

ఇంటి నుంచి బయటకు రావొద్దని కరోనాపై ఊరూరా దండోరా

కరోనా వైరస్‌పై  అవగాహాన కల్పించేందుకు అన్ని గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు అధికారులు. దేశ వ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో వ్యక్తిగత శుభ్రత పాటించాలని, స్వీయ నిర్భంధంలో ఉండాలని గ్రామగ్రామాన చాటింపు వేయిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై రెండు రోజుల క్రితమే.. సమీక్ష నిర్వహించి, ప్రజలంతా వైరస్ ను నియంత్రించేందుకు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పండుగలు, ఉత్సవాలు కూడా జరుపుకోవద్దని చెప్పారు. ముందే జాగ్రత్తే శ్రీ రామరక్ష అని చెప్పారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ నెల 22(ఆదివారం)న దేశ పౌరులంతా.. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతీ ఒక్కరూ తమకు తాము స్వీయ నిర్భంధంలో ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. ప్రధాని సందేశం మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలెవరూ పర్యటనలకు, శుభకార్యాలకు వెళ్లొద్దని, ఇంట్లోనే ఉంటే వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉండదని చెప్పారు.

ఇదే విషయాన్ని రాష్ట్రంలోని గ్రామాల్లో దండోరా వేయిస్తూ.. జనమంతా శుభ్రత పాటించాలని, చేతులను సబ్బుతో గానీ, డెటాల్ తో గానీ కడుక్కోవాలని ,  సాధ్యమైనంత వరకూ ప్రయాణాలను మానుకోవాలని సూచించారు.