న్యూఢిల్లీ: ఐపీఎల్–19లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయం కారణంగా యంగ్ బ్యాటర్ ఆయుష్ మాత్రే మిగతా ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్‌కు ఈ గాయమైంది. దీని నుంచి కోలుకోవడానికి 6 నుంచి 12 వారాల టైమ్ పడుతుందని వైద్యులు సూచించారు.
దాంతో మిగతా మ్యాచ్‌లకు ఆయుష్ అందుబాటులో ఉండటం లేదు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా దిగిన ఆయుష్ రన్ తీసే క్రమంలో తొడ నొప్పితో ఇబ్బందిపడ్డాడు. తర్వాత స్కానింగ్‌లో తొడ కండరాలు చీరుకుపోయాయని తేలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆయుష్ లీగ్‌కు దూరం కావడం తమ జట్టుకు పెద్ద లోటని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అన్నాడు.

