ఏప్రిల్ నుంచి ఆయుష్మాన్ భారత్

ఏప్రిల్ నుంచి ఆయుష్మాన్ భారత్

‌‌‌‌హైదరాబాద్, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) నుంచి రాష్ర్టంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆరోగ్యశ్రీతో కలిపి ఈ స్కీమ్‌‌‌‌ను అమలు చేస్తామని, ఆరోగ్యశ్రీని కూడా మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. కోఠిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోని అని విభాగాల హెచ్‌‌‌‌ఓడీలతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. ఈసారి నేషనల్ హెల్త్ మిషన్‌‌‌‌ బడ్జెట్‌‌‌‌లో రాష్ట్రానికి అధికంగా నిధులు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని..  ఆ ఫండ్స్ తో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లు, కేన్సర్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ర్ట బడ్జెట్‌‌‌‌లోనూ ఈసారి హెల్త్‌‌‌‌కు నిధులు పెంచి, కొత్త జిల్లా కేంద్రాల్లోని దవాఖాన్లను డెవలప్‌‌‌‌ చేస్తామని తెలిపారు. అలాగే నిమ్స్‌‌‌‌లో ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంటేషన్ యూనిట్‌‌‌‌ను, కేన్సర్‌‌‌‌ యూనిట్‌‌‌‌ను మరింత డెవలప్ చేస్తున్నామని చెప్పారు. హెల్త్ స్టాఫ్‌‌‌‌కు వ్యాక్సినేషన్‌‌‌‌ పూర్తయిందని.. శనివారం నుంచి ఫ్రంట్‌‌‌‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని ఈటల ప్రకటించారు. రాష్ర్టంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయని.. అవసరమైన వారికి గాంధీ, చెస్ట్‌‌‌‌, కింగ్‌‌‌‌కోఠి, టిమ్స్‌‌‌‌ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ అందజేస్తున్నామని పేర్కొన్నారు.

టీవీవీపీ డాక్టర్లకు త్వరలో ప్రమోషన్లు

హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ లో ఇప్పటి వరకు సుమారు 1,400 మందికి ప్రమోషన్లు ఇచ్చామని ఈటల తెలిపారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్‌‌‌‌తో ఆగిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) డాక్టర్ల ప్రమోషన్లను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌‌‌‌పై సీఎం సంతకం చేశారని వెల్లడించారు. 600 మందికి ప్రమోషన్లు వస్తాయని పేర్కొన్నారు. డాక్టర్ల ఖాళీలను ఇక ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ దవాఖాన్లలో బయోమెట్రిక్!

ప్రభుత్వ దవాఖాన్లలో బయోమెట్రిక్ అటెండెన్స్‌‌‌‌ అమల్లోకి  తీసుకురావాలని హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్ నిర్ణయించింది. మంత్రి ఈటలతో సమీక్షలో ఈ అంశంపై చర్చించినట్టు తెలిసింది. దవాఖానాల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలపై గతంలోనే అధికారులు భావించినప్పటికీ అమలు కాలేదు. కొంతమంది డాక్టర్లు వ్యతిరేకించడమే ఇందుకు కారణమని ఆఫీసర్లు మంత్రికి వివరించారు. మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్ కంపల్సరీ చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లతో పాటు మిగతా అన్ని దవాఖాన్లలో బయోమెట్రిక్ అమలు చేయాలని మంత్రి సూచించినట్టు తెలిసింది. డాక్టర్లతో చర్చించి వారి సందేహాలను పరిష్కరించాలని, ఆ తర్వాత ప్రపోజల్స్ రెడీ చేయాలని హెచ్‌‌‌‌ఓడీలను ఆదేశించినట్టు సమాచారం. టీచింగ్ హాస్పిటళ్లలో సమస్యలను పరిష్కరించాలని సూపరింటెండెంట్లకు సూచించారు. హైదరాబాద్‌‌‌‌లోని గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్‌‌‌‌లో కొత్త యంత్రాల ఏర్పాటుకు మంత్రి ఓకే చెప్పారు. డెంటల్ ఇంప్లాంట్స్‌‌‌‌ ఫ్రీగా అందించాలని నిర్ణయించారు.