ఆశావహుల్లో బీ ఫామ్ బెంగ..రెబెల్స్ బెడద లేకుండా నేతల  వ్యూహం

ఆశావహుల్లో బీ ఫామ్ బెంగ..రెబెల్స్ బెడద లేకుండా నేతల  వ్యూహం
  • ఖరారు కాని ప్రధాన పార్టీల జాబితాలు
  • నేటితో ముగియనున్న విత్ డ్రా

సిద్దిపేట, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా టైం దగ్గరపడటంతో ఆయా పార్టీల ఆశావహుల్లో బీ ఫామ్ బెంగ మొదలైంది. ఇప్పటి వరకు చేర్యాల మున్సిపాల్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అన్ని వార్డులకు,  దుబ్బాక లో బీజెపీ మొత్తం వార్డులకు అభ్యర్థులను ప్రకటించగా..  తొమ్మిది వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది.  మిగిలిన  మున్సిపాల్టీల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజెపీ లు  తమ అభ్యర్థులను ప్రకటించక పోవడం ఉత్కంఠగా మారింది.

  ముందుగా జాబితాలు వెల్లడిస్తే టికెట్లు దొరకని వారు రెబెల్స్ గా బరిలో నిలుస్తారని నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటం ఆశావహుల్లో టెన్షన్ ను పెంచుతోంది.  జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ , గజ్వేల్ మున్సపాల్టీల్లోని 72 వార్డులకు నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీల నుంచి టికెట్​ ఆశించించిన పులువురు నామినేషన్లు దాఖలు చేశారు.

నాలుగు మున్సిపాల్టీల్లో మొత్తం 72 వార్డులకు గాను బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ టికెట్ల ను ఆశించి  343 మంది నామినేషన్లు దాఖలు చేసారు. వీరిలో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించే పరిస్థితి నెలకొనడంతో ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల గెలుపు అవకాశాలు లేకున్నా టికెట్ కోసం పట్టుబడుతున్న నేతలను బుజ్జగిస్తున్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నా వారు దారికి రావడం లేదు. దీంతో నామినేషన్ల విరమణకు చివరి రోజైన మంగళవారం సాయంత్రం వరకు జాబితాలను వెల్లడించే దిశగా ఆయా మున్సిపాల్టీల్లో ముఖ్య నేతలు సిద్దం అవుతున్నారు.

టికెట్ దొరక్కుంటే రెబల్ గా..

కౌన్సిలర్ గా పోటీ చేయడానికి ఆయా పార్టీల నుంచి టికెట్ దొరక్కుంటే రెబల్ గా పోటీ చేసే దిశగా కొందరు సిద్దం అవుతున్నారు. దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాల్టీల్లో  ఎస్సీ రిజర్వ్ చేసిన వార్డుల్లో ఒకే వర్గానికి టికెట్లు  ఇవ్వడంపై కొందరు సోషల్ మీడియా వేదికగా ఆవేదనను వ్యక్తం చేస్తూ తాము బరిలో వుంటామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో సైతం అన్ని పార్టీల్లో టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది.  టికెట్లు రాని వారు రెబెల్స్ గా బరిలోకి దిగే అవకాశం వుందనే ఉద్దేశంతో ముఖ్య నేతలు  మంగళ వారం సాయంత్రం వరకు పార్టీ తరపున పోటీ చేసి వారి జాబితా తో పాటు బీ ఫామ్స్ ను నేరుగా మున్సిపల్ అధికారులు సమర్పించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. 

ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్ష

జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారుతోంది. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న సిద్దిపేట జిల్లాలో సత్తా చాటాలని కాంగ్రెస్, మంచి ఫలితాలు సాధించాలని బీజెపీ వ్యూహాలకు పదను పెడుతున్నాయి.

సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోటీ జరగగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు కావడంతో  తమకు బలమున్న మున్సిపాల్టీల్లో బీజెపీ సత్తా చూపాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీలు కార్యకర్తలతో పలు సమావేశాలు నిర్వహించి    దిశా నిర్దేశం చేసి ఇంటింటి ప్రచారాలకు శ్రీకారం చుట్టారు.  నామినేషన్ల విత్ డ్రాలు పూర్తయితే  ప్రధాన రాజకీయ పార్టీల  రాష్ట్ర నేతలు మున్సిపాల్టీల్లో ఎన్నికల ప్రచారాల కు సిద్దం అవుతున్నారు.