బీ ఫారాలొచ్చేశాయ్..పార్టీల్లో అభ్యర్థుల సెలక్షన్ లొల్లి..కాంగ్రెస్, సీపీఐ అసంతృప్తులకు బీఆర్ఎస్ గాలం

బీ ఫారాలొచ్చేశాయ్..పార్టీల్లో అభ్యర్థుల సెలక్షన్ లొల్లి..కాంగ్రెస్, సీపీఐ అసంతృప్తులకు బీఆర్ఎస్ గాలం
  • ఎంపీ రఘురాంరెడ్డి ఇచ్చిన జాబితాలపై అభ్యంతరం తెలిపిన మంత్రి సురేఖ
  • టీడీపీ అభ్యర్థులకు సీపీఐ బీ ఫారాలు

భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం, వెలుగు : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీఫారాలు ఆయా పార్టీల ముఖ్య లీడర్ల చేతికి అందాయి. బీ ఫారాలు వచ్చాయనే సమాచారంతో ఆశావహుల్లో టెన్షన్​మొదలైంది. టికెట్​కోసం లాబీయింగ్​ముమ్మరం చేశారు. సర్వేల ఆధారంగానే బీ ఫారాలు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే​స్పష్టం చేసింది. పార్టీ నిబంధనలు, సర్వేల ఆధారంగా బీ ఫారాలు ఇస్తామని సీపీఐ నేతలు పేర్కొంటున్నారు. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

కొందరికి బీ ఫారాలు అందజేత..

కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, సీపీఎంకు సంబంధించి బీ ఫారాలు ఆయా పార్టీల నేతలకు సోమవారం అందాయి. ఆయా పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థుల్లో కొందరికి సోమవారం రాత్రి వరకు అందజేశారు. మరికొందరికి మంగళవారం ఉదయం ఇవ్వనున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని డివిజన్లు, వార్డులకు మొదట ఇవ్వనున్నారు.

రెబల్స్​ఎక్కువగా ఉండి, విత్ డ్రా చేసుకోవడంలో మొండికేస్తున్న డివిజన్లకు సంబంధించి బీ ఫారాలను ఆచితూచి ఇవ్వనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్​చార్జి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ బీ ఫారాలు అందజేశారు.

ఆశావహుల్లో టెన్షన్..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్​టికెట్ల కేటాయింపులో ఖమ్మం పార్లమెంట్ పరిధి ఇన్​చార్జి, మంత్రి కొండా సురేఖకు.. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మధ్య కొంత విభేదాలొచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. మంత్రి కొండా సురేఖ ఆదివారం రాత్రి కొత్తగూడెంలో పర్యటించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​లో 60 డివిజన్లకు ఎంపిక చేసిన జాబితాను ఎంపీ.. మంత్రి ముందు పెట్టారు. అందులో 7 నుంచి 9 మంది పేర్లను మార్చాలని ఆమె సూచించారు. పలు రకాల సర్వే ఆధారంగా జాబితాను రూపొందించామని, ఇంకా కొన్ని డివిజన్లలో మరోసారి సర్వే చేయిస్తున్నామని ఎంపీ.. మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. 

టికెట్ల లొల్లి షురూ..

బీఆర్ఎస్​ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఇన్​చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మధ్య టికెట్ల లొల్లి మొదలైంది. తనకు సంబంధం లేకుండా ఏకపక్షంగా టికెట్ల కేటాయించారని రేగా అలిగినట్టుగా సమాచారం.

కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​లో డివిజన్ల వారీగా రేగా కాంతారావు ప్రకటించిన ఇన్​చార్జీలను వద్దిరాజు, వనమా పక్కన పెట్టడంతో  ఆయన సీరియస్​గా ఉన్నారని ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు చెబుతున్నారు. మొదటి నుంచి రేగాకు వనమాకు మధ్య పెద్దగా సయోధ్య లేదు. నేతల మధ్య విభేదాలు తమపై ప్రభావం చూపుతాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 

టీడీపీ నేతలకు సీపీఐ బీ ఫారాలు..

టీడీపీ అభ్యర్థులకు సీపీఐ టికెట్లు ఇవ్వడం కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​లో చర్చనీయాంశంగా మారింది. పాల్వంచలో టీడీపీ బలంగా ఉండడంతో ఆ పార్టీతో సీపీఐ నేతలు అనాధికార పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారిలో పలువురికి బీ ఫారాలు ఇస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచలో 27 డివిజన్లు ఉండగా, అందులో కనీసం పది వరకు టీడీపీకి చెందిన నేతలకు సీపీఐ బీ ఫారాలు ఇవ్వడం గమనార్హం.