
సిద్దిపేట/ జోగిపేట, వెలుగు : ఆందోల్ నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్ కొడుకు ఉదయ్ ఆదివారం బీఆర్ఎస్ లో చేరారు. సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాగా బీజేపీలో మొదటి నుంచి బాబు మోహన్‌కు ఎదురుగాలి వీస్తూనే ఉంది.
ఆందోల్ బీజేపీ టికెట్ఆశించిన మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్యకు అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దీంతో బాలయ్య బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరారు. ఆయనతో పాటు మరి కొందరు సీనియర్లు కూడా పార్టీని వీడారు. అలాగే బాబు మోహన్ కొడుకు ఉదయ్ కూడా బీజేపీ టికెట్ ఆశించారు. కానీ పార్టీ హైకమాండ్ ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఉదయ్.. బీఆర్ఎస్ లో చేరారు.