గాంధీలో శిశువు కిడ్నాప్ కలకలం..గంటల్లోనే ఛేదించిన పోలీసులు

గాంధీలో శిశువు కిడ్నాప్ కలకలం..గంటల్లోనే ఛేదించిన పోలీసులు
  • గంటల్లో కిడ్నాపర్​ను పట్టుకున్న పోలీసులు
  • తల్లికి అప్పగింత

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలో రెండు రోజుల వయస్సున్న బాబు కిడ్నాప్ సంచలనం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఎస్ కే సుభాన్​భార్య షాహీనా(25) మంగళవారం రాత్రి 10.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు షాహీనాను తీసుకొని సుభాన్​డాక్టర్​దగ్గరికి వెళ్లాడు. 

షాహీనా అత్త చతుబీ ఎంసీహెచ్​బిల్డింగ్​గైనిక్​వార్డులోని బాబు వద్ద ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆమె వాష్​రూమ్​కు వెళ్లింది. తిరిగొచ్చి చూడగా బాబు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే వార్డులో ఓ మహిళ ఉదయం నుంచి అనుమానాస్పదంగా తిరుగుతోందని, ఆమెపై అనుమానం ఉందని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా ఓ మహిళ బాబును ఎత్తుకెళ్తూ కనిపించింది. 

ఆరా తీయగా ఆమె బిహార్​కు చెందిన పూజాదేవి అని తెలిసింది. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆమె నాచారం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పూజాదేవిని పట్టుకుని విచారించగా పిల్లలు లేని తన కొలీగ్​కు బాబును ఇచ్చినట్లు చెప్పింది. వెంటనే వారి వద్ద నుంచి బాబును స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు పూజాదేవిని అరెస్ట్​చేశారు.