- 23 నుంచి 26వరకు పద్దులపై చర్చ
- ఉగాది, రంజాన్, శ్రీరామ నవమికి సెలవులు.. ఆదివారం సభ
- బీఏసీ సమావేశంలో నిర్ణయం
- డ్రగ్స్, మూసీ పునరుజ్జీవంపై స్వల్పకాలిక చర్చ ఉండే చాన్స్
- క్యూర్‌తో పాటు మరిన్ని బిల్లులకు ఆమోదం లభించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 20న 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‌లో జరిగిన సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, సభలో సభ్యుల చర్చ, సీఎం సమాధానం ఉంటాయి.
మార్చి 19న ఉగాది సెలవు కాగా.. ఆ మరుసటి రోజు 20న 2026–27 వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతారు. 21,22 తేదీల్లో రంజాన్ సెలవులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత మార్చి 23, 24 తేదీల్లో బడ్జెట్‌పై సభలో సాధారణ చర్చ, సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం ఉంటాయి. ఇక మార్చి 25 నుంచి 29 వరకు పద్దులపై ఓటింగ్, ప్రభుత్వ బిల్లులపై చర్చలు నిర్వహిస్తారు. మార్చి 30న ద్రవ్య వినిమయ బిల్లుల (అప్రాప్రియేషన్ బిల్స్) ఆమోదంతో సమావేశాలు ముగియనున్నాయి.
ఆదివారం సభ..
27న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సభకు సెలవు ఇచ్చారు. అయితే, ఆదివారం కూడా సభను నడపనున్నారు. ఆర్థికపరమైన అంశాలతోపాటే ఈ దఫా సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రధానంగా గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఉద్దేశించిన కొత్త బిల్లును సభ ముందుకు తీసుకురానున్నది. అలాగే, ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కొత్తగా ‘కోర్ అర్బన్ యాక్ట్’ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. డ్రగ్స్, మూసీ పునరుజ్జీవనంపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం ఉంది.
బీఏసీ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రావు, కేపీ వివేకానందగౌడ్, బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలకు సభకు సెలవు ప్రకటించి, మిగతా అన్ని రోజులు సభను నడపాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. పనిదినాలను పెంచే క్రమంలో ఆదివారాలు కూడా అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలన్న ఇతర పక్షాల అభిప్రాయాలకు సమావేశంలో సానుకూలత వ్యక్తమైంది.
