జీడిమెట్ల, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో రూ.300 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. బాచుపల్లి సర్వే నంబర్లు 142, 143, 144లోని 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ పార్కు కోసం కేటాయించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటి, అభివృద్ధి చేసి నర్సరీ సైతం నిర్వహించారు. బోర్వెల్, వాటర్ సంప్, వాచ్మెన్ రూమ్, ఇనుప గేట్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 2023లో కొంతమంది వ్యక్తులు నర్సరీని ధ్వంసం చేసి తమ భూమి అంటూ ప్రహరీ గోడ నిర్మించారు. ఇటీవల ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన హైడ్రా సిబ్బంది మంగళవారం అక్రమణలు తొలగించడంతోపాటు ఫెన్సింగ్, బోర్డు ఏర్పాటు చేశారు. అదే సర్వే నంబర్లలో తహసీల్దార్ కార్యాలయం కోసం కేటాయించిన మరో 30 గుంటల భూమికి సైతం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో హైడ్రా అధికారులను స్థానికులు అభినందించారు.
