V6 News

సర్కారు నుంచి ఇంటర్ కాంట్రాక్టు లెక్చరర్ల ఫైల్ వెనక్కి

సర్కారు నుంచి ఇంటర్ కాంట్రాక్టు లెక్చరర్ల ఫైల్ వెనక్కి

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు పంపించిన ప్రతిపాదనలను సర్కారు తిప్పి పంపింది. సమగ్ర వివరాలతో మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. అయితే ఎలాంటి కాంట్రవర్సీ లేని వారితో పాటు డిస్టెన్స్ వర్సిటీల్లో చదివినవారు, ఓవర్ ఏజ్డ్, సర్టిఫికెట్లు లేనివారు, తదితర అంశాలతో కూడిన ఐదు కేటగిరీల్లో వివరాలను పంపించారు. ఇందులో 3,075 మంది రెగ్యులరైజేషన్ కు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. 479 మంది కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ పై మాత్రం అనుమానాలు మొదలయ్యాయి. 

3,075 మందికి లైన్ క్లియర్..  

త్రీమెన్ కమిటీ రిపోర్టు ఆధారంగా ఇంటర్ బోర్డు కాంట్రాక్టు లెక్చరర్లను ఐదు కేటగిరీలుగా విభజించి లిస్టును సర్కారుకు పంపింది. 3,075 మంది క్వాలిఫైడ్ కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నట్టు పేర్కొనగా, వీరిలో రెగ్యులర్ కోర్సుల్లో 2,618 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 457 మంది ఉన్నారు. ఇతర రాష్ర్టాల్లో డిస్టెన్స్ మోడ్​లో పీజీ చేసిన వారు 247 మంది ఉన్నట్టు తేల్చారు. దీంట్లో రెగ్యులర్ కోర్సుల లెక్చరర్లు 211 మంది, ఒకేషనల్ లో 36 మంది ఉన్నారని పేర్కొన్నారు. అయితే విధుల్లోకి తీసుకునే టైమ్​లోనే ఏజ్ లిమిట్ దాటిన వారు 120 మంది, విధుల్లోకి తీసుకునే టైమ్​లో క్వాలిఫికేషన్ లేని వారు మరో 112 మంది ఉన్నట్టు సర్కారుకు పంపించిన నివేదికలో వివరించారు. ఈ లెక్కన 479 మంది లెక్చరర్ల రెగ్యులరైజేషన్ డైలమాలో పడింది. వీరి క్రమబద్ధీకరణపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

డిస్టెన్స్ వర్సిటీలపై అయోమయం 

కాంట్రాక్టు లెక్చరర్ల డిస్టెన్స్ యూనివర్సిటీల సర్టిఫికెట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. త్రీమెన్ కమిటీ కూడా ఇతర రాష్ర్టాల్లోని వర్సిటీలకు యూజీసీ గుర్తింపు ఉందా? లేదా? అనే అంశం మాత్రమే తెలిపింది. కోర్సుల వారీగా వివరాలను ఇవ్వలేదు. ఒక రాష్ట్రంలో ఉన్న స్టేట్​వర్సిటీ కింద డిస్టెన్స్ మోడ్​లో చదివిన వారివి చెల్లుతాయా? లేదా? అనే అంశంపై అధికారుల్లోనూ తలోమాట వినిపిస్తోంది. అయితే  ఇతర రాష్ర్టాల్లోని డిస్టెన్స్ వర్సిటీల్లో చదివిన పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లలో కొందరిని టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇటీవలే టర్మినేట్ చేశారు. ఇంటర్ బోర్డులో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇతర రాష్ర్టాల్లోని వర్సిటీల్లో అక్కడే ఉండి చదివితే వాటికి గుర్తింపు ఉంటుందని, కానీ ఆ రాష్ర్టం పరిధి కాకుండా వేరే స్టేట్స్​లోని స్టడీ సెంటర్లలో ఎగ్జామ్స్ రాస్తే చెల్లవని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత లోతైన స్టడీ చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో డిస్టెన్స్ వర్సిటీల్లో చదివిన కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్​పై అయోమయం నెలకొన్నది. 

రోస్టర్ లిస్టులు పంపండి: వాకాటి కరుణ  

కాంట్రాక్టు లెక్చరర్లకు రోస్టర్ పాయింట్లను ఫిక్స్ చేసి ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. ఒరిజినల్ జాబితాలోని ప్రతి పేజీని సర్టిఫై చేసి పంపాలన్నారు. క్వాలిఫైడ్ లిస్టు కాకుండా, ఇతర నాలుగు కేటగిరీలకు సంబంధించిన కరెక్ట్ సిఫారసుల లిస్టు రెడీ చేయాలని చెప్పారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వర్సిటీల్లో రెగ్యులర్, డిస్టెన్స్ లో చదివిన వారికి సంబంధించి ప్రత్యేక లిస్టును పంపించాలని, అలాగే ఏడు ఒకేషనల్ కోర్సుల లిస్టును పంపించాలని ఆదేశించారు.