లక్నో: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. ద్వంద్వ పౌరసత్వం వ్యవహారంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమైనా చేపట్టాలి లేదంటే ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని హైకోర్టు సూచించింది.
వివాదం ఏంటంటే..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ద్వంద పౌరసత్వం ఉందని కర్ణాటకకు చెందిన విఘ్నేష్ శిశిర్ అనే న్యాయవాది లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీకి ఇండియాతో పాటు బ్రిటన్ సిటిజన్ షిప్ కూడా ఉందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. భారత చట్టాల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం అనుమతించబడదని.. మరొక దేశం పౌరసత్వాన్ని తీసుకున్న తర్వాత భారత పౌరసత్వం రద్దు చేయబడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. భారత చట్టాలకు విరుద్ధంగా డ్యుయెల్ సిటిజన్షిప్ కలిగి ఉన్న రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించాలని కోరారు.
కానీ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు విఘ్నేష్ శిశిర్ పిటిషన్‌ను తిరస్కరించింది. పౌరసత్వానికి సంబంధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన లక్నో బెంచ్.. ద్వంద పౌరసత్వం ఆరోపణలపై రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమైనా లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకైనా అప్పగించాలని సూచించింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు విఘ్నేష్ శిశిర్ మాట్లాడుతూ.. ద్వంద్వ పౌరసత్వ ఆరోపణలకు సంబంధించి రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించిందని తెలిపారు. రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా కోత్వాలి పోలీస్ స్టేషన్‌ను న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. ఈ పరిణామాన్ని చారిత్రాత్మక, కీలక తీర్పుగా అభివర్ణించారు. ఈ నిర్ణయం జాతీయ భద్రత, విస్తృత ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా ఉందన్నారు.

