V6 News

Movie Review: టీవీ చుట్టూ తిరిగిన మిస్టరీ.. కిరణ్ అబ్బవరం ‘తిమ్మరాజుపల్లి TV’ ఎలా ఉందంటే?

Movie Review: టీవీ చుట్టూ తిరిగిన మిస్టరీ.. కిరణ్ అబ్బవరం ‘తిమ్మరాజుపల్లి TV’ ఎలా ఉందంటే?

హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌‌‌‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటించారు. వి.మునిరాజు దర్శకత్వం వహించాడు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాత. విలేజ్ పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 17, 2026న) థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

అయితే, సినిమాపై టీజర్‌, ట్రైలర్‌ పెంచిన అంచనాలు ఒక ఎత్తైతే, వినూత్న ఆలోచనలతో చేసిన ప్రమోషన్స్ మరో ఎత్తు. సాధ్యమైనంతవరకు సినిమాను జనంలోకి తీసుకెళ్లడానికి నిర్మాతగా కిరణ్ అబ్బవరం చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కొత్త ప్రతిభను వెండితెరకు పరిచయం చేయాలని చాలా ఆరాటపడ్డాడు. అలా చేసిన ప్రయత్నాలే ప్రేక్షకుడి మనసుల్లోకి బలంగా చేరాయి.

మరి సినిమా థియేటర్ ప్రేక్షకులకి, ఎలాంటి అనుభూతుని ఇచ్చింది? వింటేజ్ స్టైల్ విలేజ్ డ్రామా ఆకట్టుకుందా? లేదా? ఇంతా టీవీ నడిపిన కథేంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథగా.. 

90వ దశకంలో టీవీలు కొత్తగా ఊళ్లలోకి వస్తున్న కాలం. పండుగల సమయంలో గ్రామస్తులు చందాలు వేసుకుని అద్దె టీవీ, వీసీఆర్ తెచ్చుకుని సినిమాలు చూసే ఆనందంలో మునిగిపోతుంటారు. ఈ టీవీలను ఏర్పాటు చేసే పని సత్తి అలియాస్ సతీష్‌ది. అతను కమిషన్ తీసుకుంటూ, అప్పుడప్పుడు చిన్న దొంగతనాలు కూడా చేస్తూ జీవిస్తాడు. 

ఇదే సమయంలో కొత్తగా పెళ్లి చేసుకున్న రాజప్ప తన ఇంటికి మొదటిసారి టీవీ కొనుక్కొస్తాడు. దీంతో ఆ ఇల్లు గ్రామస్తుల వినోద కేంద్రంగా మారుతుంది. అలా జనాలు ఎక్కువ అవ్వడంతో కొత్త దంపతులకు ప్రైవసీ లేకుండా పోతుంది. మరోవైపు రాజప్ప చెల్లెలు శారద, సతీష్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుసుకుంటాడు.

అప్పటికే సంసారం నడవక అసహనంతో ఉన్న రాజప్ప, సతీష్‌పై చేయి చేసుకుంటాడు. సతీష్ కూడా ఎదురుదాడి చేస్తాడు. కోపంతో సతీష్ టీవీని తీసేస్తానని సవాల్ చేస్తాడు. అదే రాత్రి రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం జరుగుతుంది. ఆ నింద సతీష్ మీద పడుతుంది. అంతేకాదు, సతీష్‌పై కూడా దాడి జరుగుతుంది.

ఈ రెండు సంఘటనల వెనుక ఎవరు ఉన్నారు? టీవీని ఎవరు దొంగిలించారు? సతీష్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడా? శారదతో అతని ప్రేమ ఫలించిందా? లేదా అన్నదే కథలో మిస్టరీ.

ఎలా ఉందంటే..

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడిక్ డ్రామా, 90ల జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, జెన్-Z కిడ్స్‌‌కు అప్పటి ట్రెడిషన్స్‌‌ను, ఒకప్పటి కల్చర్‌‌‌‌ను తెలియజేస్తుంది. టీవీ చుట్టూ వచ్చే సన్నివేశాలు సహజంగా, ఆకట్టుకునేలా ఉంటాయి. దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చిన్నదైనా, టీవీ చుట్టూ నడిపిన కథనం, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. టీవీ దొంగతనం తర్వాత వచ్చే మిస్టరీ ఎంగేజింగ్‌గా ఉంటుంది.

దొంగను వెతికే క్రమంలో ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథను మలచడం సస్పెన్స్‌ను మరింత పెంచింది. అసలు దొంగ ఎవరనేది చివరి వరకు సస్పెన్స్‌ మైంటైన్ చేస్తుంది. క్లైమాక్స్‌లో ఎల్లమ్మ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఓవరాల్గా.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందనే? అనే ఆసక్తిని కలిగించే ఒక క్రిస్పీ సస్పెన్స్ డ్రామా.. ఈ“తిమ్మరాజుపల్లి TV”.

నటీనటులు..

కొత్త కుర్రాడు సాయి తేజ్‌ 'సతీష్' పాత్రలో చాలా సహజంగా నటించి మెప్పించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లోఆకట్టుకున్నాడు. ప్రదీప్ కొట్టె రాజప్పగా తన కోపం, ఫ్రస్ట్రేషన్‌ను బాగా చూపించాడు. వేద జలంధర్ శారద పాత్రలో సింపుల్‌గా, నేచురల్‌గా కనిపించింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా గ్రామీణ నేటివిటీకి తగ్గట్టుగా రియలిస్టిక్‌గా నటించి సినిమా స్థాయిని పెంచారు. 

టెక్నీకల్..

దర్శకుడు మునిరాజు కొత్తవాడైనా కథని నిజాయితీగా చెప్పి మెప్పించాడు. వంశీ కాంత్‌ రేఖన ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా థీమ్ ని కనెక్ట్ అయ్యేలా చేసింది. అక్షయ్‌ రామ్‌ సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. సుధీర్ మాచర్ల ఆర్ట్ వర్క్ 90స్ నాటి పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలా కథను గుర్తించి, నిర్మించడంలో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యాడు.