V6 News

రామ లక్ష్మణులు వలస కూలీలు.. రామాయణంపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

రామ లక్ష్మణులు వలస కూలీలు.. రామాయణంపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన నటనతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతకంటే తన ఎక్కువగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ గా కేరళ లిటరేచర్ ఫెస్టివల్ లో రామాయణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ్యవాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.  హిందూ విశ్వాసాలను కించపరుస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంతే కాకుండా ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది.

రామ లక్ష్మణులు వలస కూలీలు..

కేరళలో జరిగిన సాహిత్య ఉత్సవంలో ప్రకాష్ రాజ్ ఒక చిన్నారుల నాటక ప్రదర్శన గురించి ప్రస్తావించారు. ఆ నాటకంలో రామాయణాన్ని ఒక భిన్నమైన కోణంలో చూపించారని వివరిస్తూ ఆయన చేసిన పోలికలు వివాదానికి దారితీశాయి. రామ లక్ష్మణులు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీల వంటి వారు. వారు దక్షిణ భారతానికి వచ్చి రావణుడికి చెందిన తోటలో పండ్లు కోశారు. అది చూసిన శూర్పణఖ తన అన్న రావణుడికి ఫిర్యాదు చేయగా.. వారు ఆకలితో ఉన్నారని, తిననివ్వమని రావణుడు అంటాడు అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగకుండా.. రావణుడు ఆ తోట యజమాని అని, ఆ పండ్లకు గానూ రాముడు డబ్బులు చెల్లిస్తానంటే.. శూర్పణఖ 2000 రూపాయల బిల్లు, దానికి తోడు జీఎస్టీ  అడిగిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చివరికి రావణుడు వారిని విడిచిపెడుతూ.. పండ్లు తిన్నారు కాబట్టి వాటి విత్తనాలు నాటి, చెట్లను పెంచి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పినట్లు ప్రకాష్ రాజ్ వివరిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర - దక్షిణ వివాదం..

ప్రకాష్ రాజ్ చేసిన ఈ వివాదస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం కూడా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పవిత్రమైన రామాయణాన్ని ఉత్తర-దక్షిణ విభజన రాజకీయాలకు వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయని నెటిజన్లు ఆయనకు చురకలు అంటిస్తున్నారు.

ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు

నిజానికి ప్రకాష్ రాజ్ గతంలోనూ సనాతన ధర్మంపై, రాజకీయ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీశాయంటూ అడ్వకేట్ అమితా సచ్‌దేవా కేరళలో ఫిర్యాదు చేయడంతో ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో #BoycottPrakashRaj అనే ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు - రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (SSMB29)లో ప్రకాష్ రాజ్ 'శివుడి' పాత్రలో నటిస్తుండటంతో, ఆయనను ఆ సినిమా నుంచి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.