దాదాపు రూ . 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందుతుడు సుకేశ్ చంద్రశేఖర్ చుట్టూ ఉచ్చుబగిస్తోంది. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాను అప్రూవర్ గా మారేందుకు సిద్ధంగా ఉన్నానంటూ.. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు విచారణ కొత్త మలుపు చోటుచేసుకుంది. శుక్రవారం ( ఏప్రిల్ 17, 2026) జరిగిన విచారణలో స్పెషల్ జడ్జీ ప్రశాంత్ శర్మ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.
అప్రూవర్ పిటిషన్..
ఈ మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ పేరును ఈడీ (ED) తన అనుబంధ ఛార్జ్‌షీట్‌లో 10వ నిందితురాలిగా చేర్చింది. సుకేశ్ అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్ము నుంచి ఆమె ఖరీదైన బహుమతులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె అప్రూవర్‌గా మారితే, సుకేశ్‌కు సంబంధించిన కీలక రహస్యాలను బయటపెట్టే అవకాశం ఉంటుంది. దీనికి ప్రతిఫలంగా ఆమెకు శిక్ష నుంచి మినహాయింపు లేదా కొంత ఊరట లభించే అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తానని ఆమె కోర్టుకు విన్నవించారు.
తదుపరి విచారణ
నటి అభ్యర్థనపై స్పందించిన కోర్టు.. దీనిపై నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది. ముందుగా జాక్వెలిన్ తన అధికారిక విజ్ఞప్తిని ఈడీకి సమర్పించాలి. ఆ తర్వాత ఈడీ అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి, ఆమెను అప్రూవర్‌గా అంగీకరించాలా వద్దా అనే దానిపై కోర్టుకు నివేదిక ఇస్తారు. ఈ ప్రక్రియపై స్పందన తెలియజేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
కేసు ఏమిటంటే?
మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్ల భార్యల నుంచి సుకేశ్ చంద్రశేఖర్ రూ. 200 కోట్లు వసూలు చేసినట్లు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సుకేశ్ ద్వారా జాక్వెలిన్ , ఆమె కుటుంబ సభ్యులు దాదాపు రూ. 10 కోట్ల విలువైన లగ్జరీ కార్లు, వజ్రాల ఆభరణాలు, ఇతర ఖరీదైన బహుమతులు పొందినట్లు ఈడీ గుర్తించింది. గతంలో ఈ కేసును కొట్టివేయాలని ఆమె ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఇప్పుడు అప్రూవర్‌గా మారి సుకేశ్ బండారం బయటపెట్టాలని ఆమె భావిస్తున్నారు.

