హౌస్ బ్రేకింగ్.. ఇద్దరు దొంగల అరెస్టు

హౌస్ బ్రేకింగ్.. ఇద్దరు దొంగల అరెస్టు

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన దొంగను…. బ్యాగ్ ఫ్టింగ్ లకు పాల్పడుతున్న మరో దొంగను అనంతపురము సి.సి.ఎస్ మరియు ఒన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరుగా పట్టుకున్న వీరి నుండీ 700 గ్రాముల బంగారు ఆభరణాలు, ట్యాబ్ , సెల్ ఫోన్ , హుందాయ్ కారును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 35 లక్షలు ఉంటుంది.  శుక్రవారం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

1)  హౌస్ బ్రేకర్ అరెస్టు … వివరాలు

కడప జిల్లా పులివెందుల పట్టణానికి చెందిన చెన్నం వంశీధర్ రెడ్డి కుటుంబం చాలా ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం హైదరాబాదుకు వచ్చింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఏడవ తరగతి వరకు చదువుకుని ఆటో డ్రైవర్ గా … బేల్దారిగా జీవిస్తున్నాడు. ఈ వృత్తుల ద్వారా వచ్చే సంపాదన ఇతనికున్న తాగుడు, తదితర వ్యసనాలకు సరిపోయేది కాదు. దీంతోనే ఇతను దొంగగా అవతారమెత్తాడు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని క్రాంతి నగర్ లో ఉంటూ పలు హౌస్ బ్రేకింగులకు పాల్పడ్డాడు. తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుని ఇతనొక్కడే వెళ్లి ఆయా ఇళ్లల్లో దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఇలా… జిల్లాలోని కదిరి, కనేకల్లు, డి.హీరేహాళ్ , యాడికి, అనంతపురము … కడప జిల్లా బద్వేలు, తదితర ప్రాంతాల్లో తొమ్మిది దొంగతనాలు చేశాడు. ఇవే కాకుండా గతంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని చైతన్యపురి, వనస్థలం, సరూర్ నగర్ , కాంచన్ బాగ్ … చిత్తూరు జిల్లా తిరుపతి ఎం.ఆర్ పల్లి పోలీసు స్టేషన్ల పరిధిల్లో కూడా నేరాలు చేశాడు. గతంలో చేసిన దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చాక కూడా అదే పంథాను కొనసాగించాడు.

2) బ్యాగ్ లిఫ్టర్ అరెస్టు… వివరాలు

అనంతపూర్ లోని సూర్యానగర్ సర్కిల్ సమీపంలో ఉన్న ఎరికల సుంకయ్య బ్యాగ్ లిఫ్టింగ్ లకు పాల్పడటంలో దిట్ట. బస్సులు, ఆటోలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసుకుని సాటి ప్రయాణికుడిగా నటించి అజాగ్రత్తగా ఉన్న సమయంలో ప్రయాణీకుల నుంచీ బ్యాగులు లిఫ్టింగ్ చేయడం ఇతనికి రివాజయ్యింది. గుత్తి, పెనుకొండ, అనంతపురం నాల్గవ పట్టణం, హిందూపురం ఒకటవ పట్టణం పోలీసు స్టేషన్ల పరిధుల్లో బ్యాగ్ లిఫ్టింగులకు పాల్పడ్డాడు. ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి.

** వేర్వేరుగా ఈ ఇద్దరి అరెస్టు…

అనంతపూర్ లోని జిల్లాలో దొంగలుపై ప్రత్యేక నిఘా ఉంచాలని… దొంగతనాలు నియంత్రించాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో సి.సి.ఎస్ , అనంతపురము డీఎస్పీలు ఇ.శ్రీనివాసులు, పి.ఎన్ బాబు… సి.ఐ లు దేవానంద్ , శ్యాంరావు… ఎస్ ఐ లు జగదీష్ , రాంభూపాల్ , ఎ.ఎస్ .ఐ లు అంజాద్ అలీ, వెంకటక్రిష్ణ, రమేష్ … హెడ్ కానిస్టేబుళ్లు జాకీర్ , శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు ఫరూక్ , భాస్కర్ , మల్లి, షాకీర్ , మురళీలు బృందాలుగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. రాబడిన పక్కా సమాచారంతో చెన్నం వంశీధర్ రెడ్డిని శుక్రవారం స్థానిక టి.వి టవర్ సమీపంలో అరెస్టు చేసి 400 గ్రాముల బంగారు, హుందాయ్ కారు, ట్యాబు, సెల్ ఫోన్ …. చెరువుకట్ట సమీపంలోని ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఎరికల సుంకయ్యను అరెస్టు చేసి 300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

** ప్రశంస…. పలు హౌస్ బ్రేకింగులు… బ్యాగు లిఫ్టింగులకు పాల్పడిన ఇద్దరు దొంగలను వేర్వేరుగా పట్టుకున్న సి.సి.ఎస్ మరియు అనంతపురము ఒన్ టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ ప్రశంసించారు.