కాంట్రాక్టర్ల పెండింగ్బిల్లులు వెంటనే చెల్లించాలి : బీఏఐ

కాంట్రాక్టర్ల పెండింగ్బిల్లులు వెంటనే చెల్లించాలి : బీఏఐ
  • బిల్డర్స్​అసోసియేషన్ ఆఫ్​ఇండియా ప్రతినిధుల డిమాండ్​

మంచిర్యాల, వెలుగు: డ్రైనేజీల నుంచి డ్యామ్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల పరిధిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్​బిల్లులు వెంటనే చెల్లించాలని బిల్డర్స్​ అసోసియేషన్​ఆఫ్​ ఇండియా(బీఏఐ) నేషనల్​ వైస్​ ప్రెసిడెంట్ ​వేముల సత్యమూర్తి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ ​సిరాజ్​ఉర్​ రహమాన్​ కోరారు. పెండింగ్​ బిల్లులు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ ఈ నెల 18న నిర్వహించే చలో హైదరాబాద్​ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశాన్ని ఆదివారం మంచిర్యాలలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్​బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే పలువురు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాధాన్యత లేని పనులను నిలిపివేసి కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదన్నారు.

బిల్లుల జాప్యం కారణంగా కాంట్రాక్టర్లతో పాటు కాంట్రాక్ట్ పనులపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉద్యోగులు, ఇంజినీర్లు, సూపర్వైజర్లు, అకౌంటెంట్లు, యంత్రాల ఆపరేటర్లు, డ్రైవర్లు, కార్మికులు, నిర్మాణ సామగ్రి సరఫరాదారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎటువంటి సిఫార్సులు, వివక్ష లేకుండా సీనియారిటీ ప్రకారం బిల్లులు చెల్లించాలని కోరారు. బీఏఐ ప్రతినిధులు బి.సుగుణాకర్​రావు, కె.దేవేందర్​రెడ్డి, యు.సురేందర్, కె.ప్రభాకర్​రెడ్డి, రామారావు, రవీందర్​రావు, ఈ.మనోజ్, జితేందర్​రావు, వంశీకృష్ణ పాల్గొన్నారు.