హైదరాబాద్, వెలుగు: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చుక్కెదురైంది. రోహిత్ రెడ్డి సహా ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మల బెయిల్ పిటిషన్లను ఉప్పరపల్లి కోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెల్లడించింది. బెయిల్ పిటిషన్లతో పాటు నిందితులను మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున్న నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని సిట్ వాదనలు వినిపించింది.
ఫామ్‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలు, రోహిత్ రెడ్డి బినామీ సహా నిందితుల ఆర్థిక లావాదేవీల వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉన్నందున్న మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. సిట్ వాదనలకు ఏకీభవించిన న్యాయమూర్తి.. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే ముగ్గురి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. కాగా, ఈ ముగ్గురు నిందితులను ఇప్పటికే రెండు సార్లు కస్టడీకి తీసుకున్న సిట్.. ఆరు రోజుల పాటు విచారించింది. నిందితులు సహకరించకపోవడంతో కీలక వివరాలు రాబట్టేందుకు మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. సిట్ కస్టడీ పిటిషన్‌పై కోర్టు బుధవారం తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి.
