V6 News

వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో రెండు కాంస్యాలు

వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో రెండు కాంస్యాలు
  • బజ్‌రంగ్‌, రవి కంచు పట్టు
  • వరల్డ్‌ రెజ్లింగ్ మూడో మెడల్ తో పునియా రికార్డు
  • ఫస్ట్​ రౌండ్ లో నే ఓడిన సుశీల్​ధోనీ

వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో శుక్రవారం ఇండియా ఆనందం రెండింతలైంది. ఇప్పటికే ఒలింపిక్‌‌ బెర్త్‌‌లు ఖాయం చేసుకున్న జోష్‌‌లో ఉన్న రెజ్లర్లు బజ్‌‌రంగ్‌‌ పునియా, రవి దహియా ఇండియాకు రెండు కాంస్య పతకాలు అందించారు. రెఫరీ పక్షపాత ధోరణితో సెమీస్‌‌లో ఓడిపోయిన బజ్‌‌రంగ్‌‌ కాంస్య పతక పోరులో అదరగొట్టాడు.65 కేజీల ఫ్రీ స్టయిల్‌‌ బౌట్‌‌లో 8–7తో తల్గా ఓచిర్‌‌(మంగోలియా)పై ఉత్కంఠ విజయం సాధించాడు.

సెమీస్‌‌ ఫలితంతో నొచ్చుకున్న బజ్‌‌రంగ్‌‌ తనకు జరిగిన అన్యాయం ప్రపంచానికి తెలియాలని కాంస్య పతక బౌట్‌‌ను బహిష్కరించాలనుకున్నాడు. కానీ కోచ్‌‌ల సూచన మేరకు బరిలోకి దిగి పతకం గెలిచాడు. ఈ బౌట్‌‌లో ఫస్టాఫ్‌‌ ముగిసేసరికి బజ్‌‌రంగ్‌‌ 0–6తో వెనుకంజలో ఉన్నాడు. అయితే ఎప్పటిలాగే బ్రేక్‌‌ తర్వాత పుంజుకున్న పునియా చకాచకా పాయింట్లు రాబట్టి ఆధిక్యంలోకి రావడంతోపాటు బౌట్‌‌ కూడా గెలిచాడు. దాంతో, వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో మూడు మెడల్స్‌‌ గెలిచిన ఏకైక ఇండియన్‌‌గా రికార్డు సృష్టించాడు. పునియా 2013లో కాంస్యం, 2018లో సిల్వర్‌‌ మెడల్‌‌ గెలిచాడు.

తొలిసారి వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ బరిలోకి దిగిన రవి దహియా 57 కేజీల కాంస్య పతక పోరులో 6–3తో రెజా అత్రినాఘార్చి(ఇరాన్‌‌)పై విజయం సాధించాడు. కాగా, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ బరిలోకి దిగిన వెటరన్‌‌ రెజ్లర్‌‌ సుశీల్‌‌ కుమార్‌‌కు తొలి రౌండ్‌‌లోనే షాక్‌‌ తగిలింది. 74 కేజీల ఫస్ట్‌‌ రౌండ్‌‌ బౌట్‌‌లో సుశీల్‌‌ 9–11 తేడాతో కజిమురాద్‌‌ గజియె(అజర్‌‌బైజన్‌‌) చేతిలో ఓడిపోయాడు. ఓ దశలో 9–4తో ఆధిక్యంలో నిలిచిన సుశీల్‌‌ ఆ తర్వాత ప్రత్యర్థికి వరుసగా ఏడు పాయింట్లు ఇచ్చుకుని ఓటమి చవిచూశాడు. సుమిత్‌‌ మాలిక్‌‌ (125 కేజీ) కూడా ఫస్ట్​ రౌండ్​లోనే ఓడగా..  పర్వీన్​ (92 కేజీ) రెండో రౌండ్​లో ఇంటిదారి పట్టాడు.