చిన్నారి పెళ్లికూతురు మళ్లీ వచ్చింది

చిన్నారి పెళ్లికూతురు మళ్లీ వచ్చింది

చిన్నారి పెళ్లికూతురు.. ఈ మాట వినగానే ఠక్కున గుర్తొచ్చే పేరు అవికా గోర్. ఈ ఒక్క సీరియల్​తో చిన్న వయసులోనే ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపును అందుకుందంటే.. ఈ సీరియల్ ఎంతటి సంచలన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ‘బాలికావధు’ పేరుతో ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక.. ‘చిన్నారి పెళ్లి కూతురు’గా దక్షిణాదిన కూడా మెప్పించింది. తెలుగులో అవిక హీరోయిన్​గా ఎంట్రీ ఇవ్వడానికి ఈ సీరియల్ ఎంతగానో హెల్ప్ అయిందనడంలో సందేహం లేదు. అలాంటి గ్రేట్ హిస్టరీ ఉన్న సీరియల్ మళ్లీ ఇప్పుడు హిందీలో రీ టెలికాస్ట్ అవుతోంది. గత సోమవారం నుండి సాయంత్రం 6 గంటలకు కలర్స్ టీవీలో వస్తోంది. ఈ నేపథ్యంలో ఆనందిగా అలరించిన అవికాగోర్ సోషల్ మీడియాలో తన అభిమానులతో సరదాగా ముచ్చటించింది. దేశమంతా ప్రేమించిన మీ అభిమాన సీరియల్ మళ్లీ ప్రసారమవుతోంది, చూడమని కోరింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే రామాయణం, మహాభారతం లాంటి సీరియళ్లతో పాటు ఇలాంటి ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చిన సీరియల్స్ కూడా హిందీలో రీ టెలికాస్ట్ అవుతున్నాయి. తెలుగులో మాత్రం బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోస్ ఎక్కువ తిరిగి ప్రసారమవుతున్నాయి. అలా కాకుండా కుటుంబ సభ్యులంతా కలిసి టీవీలకు అతుక్కుపోయి చూసిన తొలి రోజుల నాటి సీరియల్స్ వస్తే బాగుంటుంది అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. మరి వారి కోరిక మేరకు తెలుగులోనూ ఇలాంటి సీరియల్స్ రీ టెలికాస్ట్ అవుతాయేమో చూద్దాం!