ఇయ్యాల్టి నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలు

ఇయ్యాల్టి నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలు

పంజాగుట్ట,వెలుగు:  బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవాలను సోమవారం నుంచి బుధవారం వరకు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ , ఎల్లమ్మ పోచమ్మ ఆలయ కమిటీ అన్నిఏర్పాట్లు చేసింది. తొలి రోజు సాయంత్రం గణపతి పూజ, పుణ్యా హవాచనం, కలశ స్థాపన, దేవతాహ్వానము, అంకురార్పణ, ఎరుర్కోళ్లు  నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 11 .34  నిమిషాలకు ముఖనక్షిత్రయుక్త అభిజిత్​లగ్న సుమూహూర్త  సమయాన ఎల్లమ్మ కల్యాణం జరుగుతుంది.  బుధవారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి రథోత్సవం నిర్వహిస్తారు. 

మూడు రోజులు జరిగే ఉత్సవాలకు సిటీ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అమ్మవారి కల్యాణోత్సవాల్లో పాల్గొనే భక్తులు ఆలయ ఆఫీసులో రూ. 2,500 చెల్లించి రసీదు తీసుకోవాలని ఆలయ కమిటీ పేర్కొంది. కల్యాణం అనంతరం అమ్మవారి శేష వస్త్రం, చీర, జాకెట్,శాలువా ,అభిషేకం లడ్డూ తలంబ్రాల బ్యాగును ఈనెల 9 నుంచి 18వ తేదీలోపు అందిస్తారని తెలిపారు.