- ఇయ్యాల్నే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్
సికింద్రాబాద్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి సిటీతోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారని చెప్పారు. కల్యాణాన్ని టీవీల్లో వీక్షించేలా లైవ్ఇస్తున్నట్లు వివరించారు. అలాగే ఆలయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ రవి కిరణ్, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఓ అన్నపూర్ణ, డీసీ మోహన్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.
25 లోపు మచ్చి మార్కెట్ బిల్డింగ్ ప్రారంభం
బషీర్ బాగ్: పది కోట్ల నిధులతో నిర్మించిన బేగంబజార్ ఫిష్(మచ్చి) మార్కెట్ బిల్డింగ్ ను ఈ నెల 25లోపు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం బల్దియా అధికారులతో కలిసి మంత్రి బిల్డింగ్‌ను సందర్శించారు. మూడు అంతస్తుల్లో 214 షాపులు ఏర్పాటు చేసినట్లు తలసాని చెప్పారు. ఇప్పటికే 39 షాపులు కేటాయించామని, మిగిలిన షాపుల కేటాయింపుకు స్థానిక నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఓ కమిటీ వేసినట్లు స్పష్టం చేశారు. 25లోపు షాపుల కేటాయింపులు పూర్తిచేసి, ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత బిల్డింగ్ బయట ఎవరైనా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
పద్మారావునగర్/ సికింద్రాబాద్: వెస్ట్ మారెడ్‌పల్లి నెహ్రూనగర్ పార్క్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్సోమవారం మొక్కలు నాటారు. వాకర్స్ కోసం పార్క్ లో నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. అలాగే పద్మారావునగర్ చిదానందం కాలనీలో కొత్తగా డెవలప్ చేసిన పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఎన్‌టీఆర్ విగ్రహం సమీపంలో రూ. 26 లక్షలతో, సాయిబాబా ఆలయం వద్ద రూ. 60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులను, వెంకటాపురం కాలనీలో రూ.40 లక్షలతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. మంత్రితో బల్దియా కమిషనర్ లోకేశ్‌కుమార్ ఉన్నారు.
