టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయండి: ట్రంప్‌ను కోరిన అమెరికా కాంగ్రెస్‌ మెంబర్స్‌

టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయండి: ట్రంప్‌ను కోరిన అమెరికా కాంగ్రెస్‌ మెంబర్స్‌
  • చైనా యాప్‌లను బ్యాన్‌ చేయాలని విజ్ఞప్తి

వాషింగ్టన్‌: ఇండియా చూపిన బాటలోనే నడవాలని, టిక్‌టాక్‌ సహా చైనా యాప్‌లను బ్యాన్‌ చేయాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుల్లో కొందరు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లెటర్‌‌ రాశారు. యాప్స్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాలని వాళ్లంతా ట్రంప్‌ను కోరారు. అమెరికా పౌరుల సమాచారం బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని, భద్రతకు భంగం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 25 మంది సభ్యులు ట్రంప్‌కు ఈ మేరకు లెటర్‌‌ రాసి సంతకాలు చేశారు. దేశ భద్రత కోసం టిక్‌టాక్‌ సహా చైనా యాప్స్‌ను, సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను నిషేధించాలని అన్నారు. ఇండియాదే కాకుండా మిగతా దేశాల పౌరుల సమాచారాన్ని కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ దొంగలిస్తుందని అన్నారు. “ అమెరికన్ల స్వేచ్ఛ, భద్రత, సమాచార గోప్యతను కాపాడాలంటే టిక్‌టాక్‌ సహా చైనా అనుబంధ సామాజిక మాధ్యమాలు, యాప్‌లను నమ్మకూడదు. వాటిని బ్యాన్‌ చేసేందుకు మేం మద్దతు ఇస్తున్నాం” అని ఆ లేఖలో పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.