- అడవుల్లో ఉన్న మిగతా వాళ్లు ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తం: మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ
- పార్టీకి మల్లోజుల, ఆశన్న తీరని ద్రోహం చేశారు.. బహిరంగ క్షమాపణ చెప్పాలి
- వాళ్లు ఆయుధాలతో లొంగిపోవడం వల్లే పార్టీ పరిస్థితి మారిపోయింది
- చనిపోయిన నక్సల్స్ కుటుంబాలను కలిసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తం
- ఇప్పటికీ మావోయిస్టు సిద్ధాంతాలు, భావజాలాన్ని వీడలేదు
- ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడంపై ఇంకా నిర్ణయించలేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు పార్టీ కూడా రాజకీయ పార్టీనే అని, తాము ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నందున ఏ ఇతర పార్లమెంటరీ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అన్నారు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే.. ఇప్పటికీ అండర్ గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలిసేలా కృషి చేస్తానని వెల్లడించారు. తాము ఆయుధాలను మాత్రమే వీడామని.. మావోయిస్టు సిద్ధాంతాలు, భావజాలం మాత్రం వీడలేదన్నారు.
అమరుల కుటుంబాలకు అండగా ఉండడంతో పాటు ప్రజాసమస్యలపై చట్టబద్ధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దేవ్‌జీ సహా నలుగురు అగ్రనేతలు గత నెల 24న జనజీవన స్రవంతిలో కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఎస్‌ఐబీ ఆధీనంలో ఉన్న దేవ్‌జీ, మల్లా రాజి రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులు, రహస్య జీవనం నుంచి బయటకు రావడానికి గల కారణాలను వెల్లడించారు.
మేం లొంగిపోలేదు.. మమ్మల్ని అరెస్ట్ చేశారు
రాష్ట్రంలో పరిస్థితులు మారాయి కానీ.. పేదరికం, వేధింపులు, పీడన తగ్గలేదని, దోపిడీ రూపం మారిందని దేవ్‌జీ చెప్పారు. ‘‘నాతో పాటు రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహా రెడ్డి అలియాస్ గంగన్న పోలీసులకు లొంగిపోయామని పోలీసులు చెప్పారు. కానీ, అది వాస్తవం కాదు. ఫిబ్రవరి 18న నన్ను హైదరాబాద్‌లోనే అరెస్ట్ చేశారు. పార్టీని సమన్వయం చేసే సమయంలో నలుగురిని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలసీ మేరకు లొంగుబాటుగా చూపించారు. ఎన్నో ఏండ్లుగా అడవుల్లో ఉన్నాం. అర్బన్(హైదరాబాద్)కు వచ్చి పట్టుబడ్డాను. ఈ క్రమంలోనే రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చాం. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన చర్చల్లో కీలక విషయాలు చర్చించాం. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని కోరాం. నిషేధం ఎత్తివేయడంతో పాటు జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. వీటికి అంగీకరిస్తే ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను కూడా జనజీవన స్రవంతిలో కలిసే విధంగా కృషి చేస్తాం. లేదంటే మా సిద్ధాంతలకు లోబడి చట్టపరిధిలోనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం” అని స్పష్టం చేశారు.
2024 ఆగస్టులో గణపతిని చూశాను.. అదే చివరిసారి
ఆపరేషన్ కగార్ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అని దేవ్‌జీ పేర్కొన్నారు. తమకు ప్రాణాలపై ఆశలేదన్నారు. దండకారణ్యంలో ప్రతి క్షణం తూటాల మధ్యే ఉద్యమం చేశామని వెల్లడించారు. ‘‘ మార్క్సిజం, లెనినిజం, మావోయిజం మా సిద్ధాంతాలు. కగార్ సహా వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో కొంతమంది లోపల మరికొంత మంది బయట ఉండాలని నిర్ణయించాం. 2023లో సెంట్రల్‌కమిటీ మీటింగ్ జరిగింది.
పొలిట్ బ్యూరో మీటింగ్ 2024 ఆగస్టులో జరిగింది. గణపతిని చూడటం అదే చివరిసారి. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్త ఉద్యమాలు, 2007 నుంచి 2024 వరకు జరిగిన కాలాన్ని సమీక్షించాం. ఉత్పత్తి సహా ఉద్యమ కార్యాచరణపై డాక్యుమెంట్ రూపొందించాం. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు రాజకీయ ఎత్తుగడలపై చర్చించాం’ అని దేవ్‌జీ వెల్లడించారు.
శాంతి చర్చలకు సిద్ధం అయ్యాం, కేంద్ర ప్రభుత్వం అవమానించింది
‘‘తెలంగాణలో జస్టిస్ చంద్రకుమార్ నాయకత్వంలో శాంతి చర్చల కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి మేం సానుకూలంగా స్పందించాం. ఆపరేషన్ కగార్ ఆపితే మేం చర్చలకు సిద్ధమే అని ప్రకటించాం. కార్యదర్శిగా బసవరాజు చేసిన విజ్ఞప్తిని కేంద్ర పట్టించుకోలేదు. అవమానించింది. చర్చలు జరగలేదు. దీంతో ఆపరేషన్ కగార్ వల్ల కొంతమంది ఫీల్డ్‌లో ఉండాలి. మరికొంత మంది బయట ఉండాలని నిర్ణయించాం. ఈ సందర్భంలో హిడ్మా ఏపీ పోలీసులకు సరెండర్ అవుతా అన్నాడు. అంచనాలు సరైనవి కావని వెళ్లొద్దని చెప్పాం. తనకున్న చానల్లో బయటకు వెళతా అనగానే చర్చించాం.
పలుమార్లు సరైన రిపోర్టులు వచ్చాయని చెప్పడంతో ఒప్పుకోక తప్పలేదు. వెళ్లగానే పోలీసులకు చిక్కారు. అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజును కూడా కోవర్టు ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్ చేశారు. కొంతమంది డబ్బుకు లొంగి, ప్రాణాలకు భయపడి శత్రులకు లొంగిపోయారు.
అర్భన్ నక్సలిజం అన్న పదమే చట్ట విరుద్ధం
అర్బన్ నక్సలిజం అనేది పాలకులు సృష్టించిందని దేవ్‌జీ చెప్పారు. ప్రజల తరఫున పోరాడే వాళ్ల గొంతు నొక్కడానికి, రాసే వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు పెట్టిన పదమే అర్భన్ నక్సలిజం అని ఆయన అభిప్రాయపడ్డారు. భావప్రకటన స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలో చెబుతూనే ప్రభుత్వ వ్యతిరేకంగా స్వేచ్ఛగా మాట్లాడితే అర్భన్ నక్సలిజం అంటున్నారని విమర్శించారు. మార్చి 31 తర్వాత మావోయిజం అంతం అన్నది సాధ్యం కాదని దేవ్‌జీ అభిప్రాయపడ్డారు.
మల్లోజుల, ఆశన్న పార్టీకి క్షమాపణ చెప్పాలి
మల్లోజుల వేణుగోపాల్(సోనూ), తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఉద్దేశపూర్వకంగానే పోలీసులకు లొంగిపోయారని దేవ్‌జీ అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. బహిరంగ క్షమాపణ చెప్తే భవిష్యత్తులో కలిసి పనిచేసేందుకు ఆలోచిస్తామన్నారు.
‘‘కగార్ దాడిలో పార్టీ కార్యదర్శి బసవరాజ్ మరణం తర్వాత మల్లోజులలో బలహీనతలు సంతరించుకొని శత్రువు ముందు లొంగిపోయాడు. ఆయుధాలను పార్టీకి అప్పగించాలని కేంద్ర కమిటీ చెప్పినప్పటికీ మల్లోజుల వాటిని శత్రువుకు అప్పగించాడు. విప్లవ ద్రోహిగా మారాడు. వీరిద్దరూ మావోయిస్టు సిద్ధాంతాలపై దాడి చేశారు. బస్వరాజు మరణం తర్వాత పార్టీ మీటింగ్‌జరగలేదు. కులవివక్షకు పార్టీలో తావు లేదు. సిద్ధాంతాల మేరకే పనిచేస్తాం. డంపులు ఉన్నాయని అనడంలో అర్థం లేదు.
