కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొడ్తరు :బండి సంజయ్

కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొడ్తరు :బండి సంజయ్
  • బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకు లేదు
  • అది ఓ అవుట్ డేటెడ్ పార్టీ: కేంద్ర మంత్రి బండి సంజయ్
  • రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది
  • ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్​కే ఉందని వ్యాఖ్య

హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, వెలుగు: బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్​ఎస్​ ఓ అవుట్ డేటెడ్​ పార్టీ అని.. ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్​కే ఉందని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండని, వాటితో ప్రజలకేం సంబంధం అని ప్రశ్నించారు. 


ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ టెంపుల్ లో జరిగిన సహస్ర చంఢీయాగానికి  ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, హైదరాబాద్ కోఠిలో యంగ్ మెన్స్ ఇంప్రూవ్ మెంట్ సొసైటీ ఆధ్వర్వంలో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లైబ్రరీ, బ్లడ్ బ్యాంకు, క్లినిక్, ఆడిటోరియం, మీటింగ్ తదితర బ్లాకులను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారని చెప్పారు. ఈ రెండు పార్టీల విలీనంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకొనేందుకే.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తొలుత కాంగ్రెస్ నాయకుడైన కేసీఆర్.. ఆ పార్టీలోకే పోతారన్నారు. ఇదంతా రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అని దుయ్యబట్టారు. 

రైతు రుణమాఫీపై శ్వేత పత్రం రిలీజ్​ చేయాలి

రైతు రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని, రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా అని ప్రశ్నించారు.  ఎన్నికల సమయంలో రూ.40వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి, బడ్జెట్ లో రూ.26 వేల కోట్లు కేటాయించారని, చివరకు రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని తెలిపారు. 

ధర్మాన్ని ఆపదలోకి నెట్టేస్తున్నరు

దేశంలో సంఘాలు, వర్గాల పేరుతో ప్రజలను చీలుస్తూ ధర్మాన్ని ఆపదలోకి నెట్టేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. వీటన్నింటిపై చర్చించి యువతలో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలకు విద్య, వైద్యంతోపాటు జాతీయవాదం, వ్యక్తిత్వ వికాసంపై యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు యంగ్ మెన్స్ ఇంప్రూవ్ మెంట్ సొసైటీ చేస్తున్న సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ‘ది యంగ్ మెన్స్ ఇంప్రూవ్ మెంట్ సొసైటీ’ పేరుతో ఎంతో మంది పెద్దలు ముందుకొచ్చి యువతలో దేశభక్తి పెంపొందిస్తూ జాతీయవాదంపై చైతన్య పర్చడమే కాకుండా పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండడం సంతోషంగా ఉందన్నారు.