
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ నెల 19న కరీంనగర్ రానున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ వస్తున్న బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికేందుకు కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. వాస్తవానికి 19న ఇద్దరూ కలిసి రాష్ట్రానికి రావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ భావించారు. అయితే 19న సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీకి హాజరు కావాలని కిషన్ రెడ్డికి సమాచారం రావడంతో తన పర్యటనను మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలున్న నేపథ్యంలో తగిన సమయం లేనందున కరీంనగర్ వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనాలని కిషన్ రెడ్డి సలహా ఇవ్వడంతో బండి సంజయ్ బుధవారం కరీంనగర్‌కు వస్తున్నారు.
సంజయ్ పర్యటన ఇలా..
సంజయ్ తొలిరోజు ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శనిగరం వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం సంజయ్.. కరీంనగర్ లో మహాశక్తి అమ్మవారిని దర్శించుకుంటారు. అదే రోజు కొండగట్టు అంజన్నతోపాటు వేములవాడ రాజశ్రీరాజేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 20న మధ్యాహ్నం వరకు కరీంనగర్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకుని స్టేట్ఆఫీస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా వారిద్దరికీ సన్మానం చేయనున్నారు. 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 23న ఢిల్లీ వెళ్తారు.
కొత్తవారినీ సన్మానించాలి: అర్వింద్
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు కొత్తగా బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు ఎంపీలనూ సన్మానించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్టు తెలిసింది. వాళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని గుర్తించాలని సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో సగం స్థానాల్లో విజయం సాధించినందున కొత్త ఎంపీలను అభినందించడం ద్వారా క్యాడర్‌లోకి విజయ సంకేతాలు బలంగా వెళతాయని పేర్కొన్నట్టు తెలిసింది. అర్వింద్ సూచనలను పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకొని, కొత్త వారిని కూడా సన్మానిస్తారా లేక కేంద్ర మంత్రులను మాత్రమే సన్మానిస్తారా చూడాలి.