- కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు
- ఇతర మతాల్లో చేరినోళ్లు సొంత మతానికి రావాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: హిందువులందరూ ఒకే తాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితి ఏర్పడిందన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు. ఆదివారం హైదరాబాద్ కూకట్‌పల్లిలో కాపు కులస్తులు నిర్వహించిన ‘కార్తీక వనభోజనాల’ కార్యక్రమంలో సంజయ్ పాల్గొని మాట్లాడారు. ఏపీ, తెలంగాణలో మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులు తిరిగి సొంత మతంలోకి రావాలని కోరారు. వారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని తెలిపారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లే అవుతుందన్నారు.
సనాతన ధర్మం గొప్పదని, హిందువుగా పుట్టడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న సనాతన ధర్మ ప్రచారంతో ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో చైతన్యం వస్తోందని చెప్పారు. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూనే హిందూ ధర్మం కోసం పనిచేయాలని కోరారు. పేదలను ఆదుకోవాలని, మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులను ఆదుకునే బాధ్యత తమదని ఆయన హామీ ఇచ్చారు.
