దళిత, గిరిజనుల భూముల్లో రియల్ దందాలు ఆపండి
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
వారి నోటికాడి ముద్దను లాక్కోవద్దని విజ్ఞప్తి
సాగు భూములు తీసుకోవాలనుకోవడం దుర్మార్గమని ఫైర్
ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
హైదరాబాద్,వెలుగు : దళిత, గిరిజనుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆపాలని, ఆ వర్గాలకు ఉన్న జీవనాధారాన్ని కాపాడాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ఎన్నో ఏండ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్డ్ చేసిన భూములకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించకపోగా, వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం దుర్మార్గమని మండిపడ్డారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోకపోవడంతో లక్షల మంది దళితులు, గిరిజనుల ఆశలు అడియాసలయ్యాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో దళిత, గిరిజన కుటుంబాలు ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటుంటే, ఆ భూములను తీసుకోవాలనుకోవడం వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమే అవుతుందన్నారు.
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామంటూ హామీ ఇవ్వడమే కాని, వాటిని అమలులో చూపెట్టడం లేదని మండిపడ్డారు. సిద్దిపేటలో దళితుల భూముల్లోనే ప్రభుత్వం వెంచర్ ప్రారంభించిందని, శంషాబాద్‌లోని గిరిజన భూముల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళితులకు, గిరిజనులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. మీరు, మీ కుటుంబం మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారా..? సంజయ్ ఫైర్ అయ్యారు.
సంక్షేమం అంటే ఎత్తయిన విగ్రహాలు, బిల్డింగ్‌లకు పేర్లు కాదు..
దళితుల సంక్షేమం అంటే ఎత్తయిన విగ్రహాలు, పరిపాలన బిల్డింగ్‌లకు పేర్లు పెట్టడం కాదని, ఆ వర్గాల వారికి జీవనోపాధి కల్పించడం ముఖ్యమని బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో దళితులకు, గిరిజనులకు రక్షణ లేకుండా పో యిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెం ట్ చెల్లింపులో నిర్లక్ష్యం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇప్పటికే చదువుకు దూరం అవుతున్నారని లేఖలో వివరించారు. ఇప్పుడు దళితులను, గిరిజనులకు మభ్యపెట్టి, భయపెట్టి వారి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. భూములకు రక్షణ కల్పించకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఢిల్లీకి బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన పిలుపు మేరకే ఆయన ఢిల్లీ వెళ్లారని పార్టీలో ప్రచారం సాగుతుండగా, ఆరోగ్య సమస్యల కారణంగా హెల్త్ చెకప్ కోసమే ఢిల్లీ వెళ్లారని సంజయ్ అనుచరులు చెప్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వివరించారని, ఆ తర్వాత ఇప్పుడు సంజయ్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. నిజానికి సంజయ్ బుధవారమే ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా, పార్టీ పరమైన కొన్ని కార్యక్రమాల వల్ల శుక్రవారం వెళ్లినట్లు తెలిసింది. ఢిల్లీ టూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ఇంచార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ లను కూడా సంజయ్ కలువనున్నారు. పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది.