బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాం : బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాం : బండి సంజయ్
  • రూ. 500 కోట్ల సంక్షేమ నిధి, బోర్డుపై కేసీఆర్ మాట తప్పిండు: బండి సంజయ్
  • బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికులను ఆదుకుంటాం 
  • కవిత ఇల్లు చూసి సీబీఐ ఆఫీసర్లు విస్తుపోయారు

కోరుట్ల రూరల్/మేడిపల్లి, వెలుగు:  గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూ.500 కోట్లతో నిధిని, ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట తప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోకి ప్రవేశంచింది. గల్ఫ్ బాధిత కుటుంబాలు సంజయ్ ని కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంటేనే గల్ఫ్ కార్మికులు, బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ పాలనలో గల్ఫ్ బాధితుల సమస్యలు తీరలేదని, గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీలను ఆరు నెలలైనా తీసుకొచ్చే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం దుబాయ్ వలస కార్మికులు కూడా కేసీఆర్ కు పైసలు ఇచ్చారన్నారు. అలాంటి వాళ్ళను కూడా దారుణంగా తిట్టిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. భాషలో కేసీఆరే తనకు గురువు అని అన్నారు. యాత్రలో బీజేపీ నేతలు తుల ఉమ, సత్యనారాయణ, కొరండ్ల మధుకర్, శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

దేశంలోనే సంపన్న సీఎం కేసీఆర్  

దేశంలో అత్యంత ఆస్తులున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని సంజయ్ అన్నారు. లిక్కర్ స్కాంలో సంపాదించిన డబ్బుతోనే కేసీఆర్ బిడ్డ కవిత ఇంద్రభవనం లాంటి ఇంటిని కట్టుకున్నదని ఆరోపించారు. లిక్కర్ స్కాంపై విచారణ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులు ఆ ఇంటిని చూసి విస్తుపోయారని అన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తనను సీఎం కేసీఆర్ ముక్కలు చేస్తానని అంటున్నాడని, తనను చంపినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదని సంజయ్ స్పష్టం చేశారు. తాను ఓట్ల కోసం పాదయాత్ర చెయ్యడం లేదని, ప్రజా సమస్యల పరిష్కారానికే పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. ప్రధాని మోడీ తెలంగాణకు 2,40,000 ఇండ్లను మంజూరు చేస్తే.. ఆ ఇండ్లను కేసీఆర్ కట్టించడం లేదన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని మోహన్ రావు పేటలో గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమంలోనూ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఇబ్బందులను, సమస్యలను ఆయనకు వివరించారు. కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జేఎన్ సునీత వెంకట్ ఆధ్వర్యంలో పెద్దమ్మ ఆలయంలో సంజయ్ కి బెల్లంతో తులాభారం నిర్వహించగా, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.