ఎమ్మెల్యే సామేల్‌‌‌‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి

ఎమ్మెల్యే సామేల్‌‌‌‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి
  • హిందువులను కించపరిచేలా మాట్లాడిండు: బండి సంజయ్
  • అంజన్న ఆశీర్వాదం పేరుతో కరీంనగర్​ నుంచి కొండగట్టుకు పాదయాత్ర
  • వేలాది మందితో 14 గంటల్లో 40 కి.మీ.లు నడక

కరీంనగర్/జగిత్యాల, వెలుగు: కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ హిందువులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు దారుణమని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గాంధీభవన్ వేదికగా బ్రాహ్మణులు ఆశీర్వచనం ఇస్తే.. మందుల సామేల్ వారి గురించి పచ్చి బూతులు మాట్లాడితే కాంగ్రెస్ నేతలు చప్పట్లు కొట్టడం సిగ్గు చేటన్నారు. కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్రగా బయల్దేరే ముందు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల బాటలోనే ఎమ్మెల్యేలు నడుస్తున్నారని విమర్శించారు. మా కాళ్ల కింద పడి ఉండాల్సిందేనని ఒవైసీ కించపరిచినా పట్టించుకోరని ధ్వజమెత్తారు.

 అసలు మందుల సామేల్ ఎస్సీనా? క్రిస్టియనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమైన క్రిస్టియన్ పరులను దూషించడని అన్నారు. ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయడంతోపాటు మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తిలో మందుల సామేల్ కు శిక్ష తప్పదని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కొండగట్టు అభివృద్ధికి నిధులిచ్చింది ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వమేనని, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటంవల్లే నిధులు తెచ్చుకోగలిగామన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే.. టీటీడీ తరహాలో కొండగట్టును అద్బుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రతిపాదనలు పంపి ఉంటే ప్రసాదం స్కీం కింద పెద్ద ఎత్తున నిధులు తెచ్చేవాడినని, ఇప్పుడు ఆ స్కీం గడువు ముగిసిపోయిందన్నారు. 

మొక్కులు చెల్లించుకున్న కేంద్రమంత్రి

అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో బండి సంజయ్ బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి చేపట్టిన ఒకరోజు పాదయాత్ర శనివారం దిగ్విజయంగా ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠం దక్కితే తన పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని ఆయన గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మొక్కులో భాగంగా కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం శనివారం ఉదయం 7.50 గంటలకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతోపాటు 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు వేలాది మంది బీజేపీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా బయల్దేరారు. 

దారిపొడవునా ఊరూరా ప్రజలు పూల మాలలు, మహిళలు మంగళహారతులు, వీర తిలకంతో బండి సంజయ్ కు ఘనస్వాగతం పలికారు. మండుటెండలో కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా కేవలం సాక్స్ తో నడిచారు. రామడుగు మండలం వెదిర సమీపంలోని కోన్ రావుపేటలో డ్రోన్ తగిలి తేనేటీగలు కొందరిపై దాడి చేసినా వెరవలేదు. మధ్యాహ్నం 3.30 గంటలకు గంగాధర మండల కేంద్రానికి చేరుకున్నారు.  అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసి కాసేపు బండి సంజయ్ సేద దీరారు.

సాయంత్రం 5.30 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభించి రాత్రి 10.30 గంటలకు కొండగట్టుకు చేరుకున్నారు. బండి సంజయ్ 14 గంటల్లో 40 కిలోమీటర్ల మేర నడిచి కొండగట్టుకు చేరుకున్నారు. అనంతరం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి అంజన్న ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.