
ఢిల్లీలో రాజశ్యామల యాగం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్..యాగం సాక్షిగా లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాంలో తమ కూతురుకు ఎలాంటి సంబంధం లేదని కేసీఆర్ ప్రమాణం చేయాలన్నారు. స్వార్థం కోసం యాగం చేస్తున్న కేసీఆర్.. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. యాగంలో మైకు దగ్గరగా పెట్టుకుని ప్రజలకు డబుల్ బెడ్ రూంలు ఎందుకు ఇవ్వలేదో..? యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదో..? దళితులకు మూడెకరాల భూమి, దళితుబంధు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర సంక్షేమ పథకాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో..? కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లీస్తున్నారో యాగంలో కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అక్రమాలను చూసి ఏ దేవుడు ఆయన్ను క్షమించరని చెప్పారు.
ఎందుకు ఖండించడం లేదు..
లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందన్న వార్తలను సీఎం కేసీఆర్ ఎందుకు ఖండించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి లబ్దిపొందాలని కేసీఆర్ చూస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ జనం బలికావాలా అని ప్రశ్నించారు. పేదోళ్లను కేసీఆర్ రాచి రంపాన పెడుతున్నారని ఆరోపించారు. ఒకప్పుడు కారుకు లోను కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్..ఇవాళ దేశంలోనే సంపన్న సీఎంగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకుని విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు.
సాక్షే అయితే భయమెందుకు..?
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు వెళ్తే ఎందుకు భయమేస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు. కవితను సాక్షిగానే విచారించేందుకు సీబీఐ వస్తుంటే..ఆమె ఇంటి ముందు సింహాలు, పులుల ఫ్లెక్సీలు ఎందుకున్నారు. లిక్కర్ స్కాంలో కవిత ఇన్వాల్వ్ అయింది కాబట్టే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడికైనా వెళ్లి విచారించే అధికారం సీబీఐకి ఉందన్నారు. తెలంగాణ.. భారతదేశంలో అంతర్భాగమని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కవిత ఇంట్లోని సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ముందు ఈడీ రావడం కాదని..మోడీ వచ్చే ముందు కేసీఆర్ కు కొవిడ్ వస్తుందని....మోడీ వచ్చే ముందు కేటీఆర్ కాలుకు దెబ్బ తగులుతుందని...మోడీ వచ్చే ముందు కవిత దుబాయ్ పారిపోతుందని ఎద్దేవా చేశారు.