దెబ్బకు దెబ్బ పక్కా ఉంటది

దెబ్బకు దెబ్బ పక్కా ఉంటది

జనగామ మున్సిపల్ కమిషనర్, సీఐని సస్పెండ్ చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  దెబ్బకు దెబ్బ పక్కా ఉంటదని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం కాదని… కొందరు పోలీస్ అధికారులు…ప్రమోషన్ల కోసం బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తో రాష్ట్ర ప్రజలకు ప్రాణ భయం ఉందన్నారు. సీఎంతో యుద్ధం చేయటానికి తాము సిద్ధమన్నారు.  ఘటనపై వెంటనే సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు సంజయ్.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగామ టూర్ కొనసాగుతోంది.. జనగామా చౌరస్తా నుంచి జిల్లా నేతలు, కార్యకర్తలతో కలిసి జనగామ హాస్పిటల్ వరకు ర్యాలీ తీస్తున్నారు. మంగళవారం లాఠీచార్జ్ లో గాయపడిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మతో పాటు, మరో ముగ్గురు జనగామ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. హాస్పిటల్లో వీరిని సంజయ్ పరామర్శించనున్నారు. దీంతో జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నేతలు చలో జనగామకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. గ్రేహౌండ్, స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మంగళవారం జనగామలో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై  లాఠీ చార్జ్ చేశారు. వివేకానంద జయంతి సందర్భంగా  బీజేపీ కార్యకర్తలు ప్లేక్సీలు ఏర్పాటు చేశారు. అయితే టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఉంచి, బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించారు మున్సిపల్ అధికారులు. దీంతో బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎలాంటి గొడవ జరగకపోయినా  సీఐ మల్లేశ్  ఒక్కసారిగా రెచ్చిపోయి బీజేపీ, బీజేవైఎం నాయకులపై లాఠీచార్జ్ చేశారు. తాము చెప్పేది వినాలని బీజేపీ నాయకులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం చితకబాదారని బాధితులంటున్నారు.. ఈ ఘటనలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.