- గులాబీ జెండాను పాతరేసిన.. పచ్చ జెండాను పాతిపెట్టేదాకా విశ్రమించ
- ఎంఐఎంకు మేయర్ పీఠం అప్పగించేందుకు కాంగ్రెస్ డీల్
- కరీంనగర్‌లో కబ్జాదారుల భరతం పడతామని వార్నింగ్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్‌పై ఎగిరేది కాషాయ జెండానేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. ‘‘ఒవైసీ.. కరీంనగర్ నా అడ్డా.. ఇక్కడ పచ్చజెండా (ఎంఐఎం)ను పాతిపెట్టే వరకు విశ్రమించ” అని తేల్చి చెప్పారు. గతంలో చెప్పినట్లుగానే కేసీఆర్‌ను ఫాంహౌజ్‌కు పంపి గులాబీ జెండాను పాతరేశానని,ఈ సారి పచ్చ జెండాను పాకిస్తాన్‌కు పంపుతానని హెచ్చరించారు.
కరీంనగర్‌లో ఎంఐఎంకు మేయర్ సీటును అప్పగించేందుకు కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. అందుకే జగిత్యాల, కరీంనగర్ వచ్చి ఎంఐఎం సత్తా చూపుతామని, కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ఒవైసీ బీరాలు పలుకుతున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్ లోని రాజస్తాన్ చౌరస్తా, లయోలా కాలేజీ, బుట్టి రాజారాం కాలనీ, బ్యాంక్ కాలనీ, భగత్ నగర్ భగత్ సింగ్ విగ్రహ చౌరస్తా వద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మహిళలు పడుతున్న బాధలను తొలగించేందుకే మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేసిందని చెప్పారు. దీంతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా? లేదా? సమాధానం చెప్పాలని ఒవైసీని ప్రశ్నించారు.
ప్రశాంతంగా ఉన్న కరీంనగర్‌లో మతం పేరుతో చిచ్చు పెట్టి మారణహోమం సృష్టించేందుకే ఎంఐఎం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితే లేదని, ఈ సారి 4 సీట్లకే పరిమితం కాబోతున్నదని జోస్యం చెప్పారు. పొరపాటున ఎంఐఎంను గెలిపిస్తే కరీంనగర్‌లో ప్రజలు ప్రశాంతంగా ఉండే పరిస్థితే ఉండదన్నారు. ముస్లింలను రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్న ఒవైసీ కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టి.. ముస్లింలను మాత్రం బికారీలను చేసిందని విమర్శించారు.
ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా నిలుస్త
కరీంనగర్‌లో ప్రజల జాగాలను కబ్జాలు చేసే నాయకు ల భరతం పడతానని బండి సంజయ్ హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కవచంగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో కబ్జాలకు పాల్పడిన 9 మంది కార్పొరేటర్లను అరెస్ట్ చేయించి బొక్కలో వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం నుంచి వరదలా నిధులు వస్తున్నాయని, మేయ ర్ పీఠాన్ని అప్పగిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
