
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తిండి లేక.. తిప్పలు లేకుండా రాత్రి పగలు చదువుకుని పరీక్షలు రాస్తే.. అలాంటి పిల్లల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. కష్టపడి చదివిన నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రి వర్గం తప్పు చేయలేదనుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ ను పూర్తిగా రద్దు చేయాలన్నారు. అందర్నీ బదిలి చేయాలన్నారు. ఫాంహౌజ్, నయీం వంటి కేసులను సిట్ దర్యాప్తు చేస్తే ఏమైందని ప్రశ్నించారు.
సీఎంకు ఒక న్యాయం..సామాన్యుడికి మరో న్యాయమా..?
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో కేటీఆర్ కు సంబంధం ఉందని బండి సంజయ్ ఆరోపించారు.కేటీఆర్ ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. సీఎం ఫ్యామిలీకి ఓ న్యాయం..సామాన్యుడికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీలో నిందితురాలు రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీలో ఉందని గుర్తు చేశారు. టీఎస్సీ పీఎస్సీ విషయంలో 30 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వెనకడు వేసేది లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు భయపడొద్దని....బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ మూర్ఖుడి పాలనను అందరి కలిసి కట్టుగా కొట్లాడి అంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడు భయపడితే.. బరితీసి కొట్లాడకుంటే.. బతుకులు నాశనం అవుతాయన్నారు.
టీచర్లకు సెల్యూట్..
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కేసీఆర్ కు చెంపచెల్లుమనేలా టీచర్లు తీర్పు ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు. టీచర్లకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వలేదు.. బదిలీలు లేవు.. ప్రమోషన్స్ లేవన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 700 కోట్ల రూపాయలు పెట్టి ఓడించాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై విద్యార్థులు, బీజేపీ నేతలు, బీజేవైఎం విద్యార్థి నాయకులు కొట్లాడితే అక్రమంగా అరెస్ట్ చేశారని..లాఠీ చార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కారుకు దమ్ముంటే ఇప్పుడు ఆపాలని సవాల్ విసిరారు.