త‌ప్పుడు కేసులు చూపిస్తూ త‌ప్పుదోవ ప‌ట్టించారు

త‌ప్పుడు కేసులు చూపిస్తూ త‌ప్పుదోవ ప‌ట్టించారు
  • తెలంగాణ స‌ర్కార్ పై బండి సంజ‌య్ ఫిర్యాదు
  • కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శికి లేఖ‌
  • మరొక ఇంటర్‌ మినిస్టీరియల్ బృందాన్ని పంపిచాల‌ని అభ్య‌ర్థ‌న

క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరీక్షలు జ‌ర‌ప‌డం లేదని, తక్కువ సంఖ్యలో మరణాలు, కేసులు చూపిస్తూ.. ఇటీవ‌ల రాష్ట్రానికి వ‌చ్చిన కేంద్రం ప్ర‌తినిధి బృందాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిందని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయ‌న‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి శనివారం లేఖ రాశారు.

కోవిడ్ -19 వ్యాధి వ్యాప్తిని సమర్ధంగా నియంత్రించడంలో హోంమంత్రిత్వ శాఖ నిర్విరామంగా కృషి చేస్తోందని లేఖ‌లో పేర్కొన్నారు సంజ‌య్. తెలంగాణలో క‌రోనా ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ బృందాన్ని పంప‌గా.. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో, వ్యాధి చికిత్స విష‌యంలో ప్రభుత్వం  అమలు చేస్తున్న తీరు సంతృప్తికర ఉన్నాయని కేంద్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసిందన్నారు . వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించడం లేదన్నారు సంజయ్. వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు చెయ్య‌డం లేద‌ని, కోవిడ్ ఆసుపత్రిగా మార్చబడిన గాంధీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి సౌకర్యాలు లేవ‌ని త‌మ‌కు వివిధ వర్గాల నుండి చాలా ఫిర్యాదులు అందాయని ఆయన పేర్కొన్నారు

ముఖ్యంగా ఆస్పత్రిలోని సరిపోను వాష్‌రూమ్‌లు లేవ‌ని, ఉన్నవాటిలోనూ చాలా సమస్యలు ఉన్నాయ‌న్నారు సంజ‌య్. ఐసిఎంఆర్ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం వాటిని నిర్వహించడం లేదని. ప్రాంగణంలో పరిశుభ్రమైన పరిస్థితులు, నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయన్నా‌రు. అంతేకాకుండా ఆసుప‌త్రిలో శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు, సహాయక సిబ్బంది కూడా సరిపడా లేరన్నారు. రోగులను గుర్తించడంలో, పరీక్షించడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింద‌న్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్‌ను అనుసరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ల‌క్ష్యం వ‌హించిందని వివ‌రిస్తూ…” సి.ఎస్. శాస్త్రి అనే ఎనభై ఏళ్ల వ్యక్తి కరోనా అనుమానంతో ఏప్రిల్ 12 న గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. పరీక్ష తర్వాత అతన్ని నెగెటివ్‌గా ప్రకటించారు. నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆసుపత్రిలో (నిమ్స్) పరీక్షించినప్పుడు పాజిటివ్ గా ప్రకటించారు. అనంతరం ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ అతను ఏప్రిల్ 26న తుది శ్వాస విడిచారు. ఏప్రిల్ 26, 27 మరియు 28 నివేదికలలో ప్రభుత్వం అతని మరణాన్ని చూపించలేదు. అయితే, అతను 26వ తేదీన కరోనాతో మరణించాడని మరణ నివేదిక స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఉదంతం, ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించడానికి అవకాశం ఇస్తుంది” అని సంజ‌య్ లేఖ‌లో పేర్కొన్నారు

రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ బృందాన్ని తప్పుదోవ పట్టించిందని తెలంగాణ బీజేపీ భావిస్తోందని, అందుకే బాధ్యతాయుతంగా వాస్తవాన్ని హోం శాఖ దృష్టికి తీసుకురావాలని ఈ లేఖ రాస్తున్నానని సంజయ్ కుమార్ వివరించారు. మరోసారి ప్రత్యేకంగా ఇంటర్ మినిస్టీరియల్ బృందాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించి క‌రోనా వైరస్ వ్యాప్తి, కోవిడ్ వ్యాధి చికిత్స తీరులను, వైధ్య సదుపాయాలను సమీక్ష జరిపించాలని అభ్యర్థిస్తున్నట్టు సంజయ్ కుమార్ హోం శాఖ సెక్రటరీని కోరారు.