హాలియ సభలో సీఎం కేసీఆర్ స్పీచ్ పై బండి సంజయ్ ప్రెస్ నోట్

హాలియ సభలో సీఎం కేసీఆర్ స్పీచ్ పై బండి సంజయ్ ప్రెస్ నోట్

తాను చెప్పింది చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగను అని నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ మరోసారి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఇప్పటి వరకు ఈ మాటను ఆయన ఎన్నో సార్లు తప్పారని ఆయన గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు.

నాగార్జునసాగర్ భూనిర్వాసితులైన గిరిజనుల భూముల్ని టీఆర్ఎస్ నేతల కబ్జాలపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదంటూ పత్రికా ప్రకటనలో సంజయ్ ప్రశ్నించారు. గుర్రంబోడు తండాలో గిరిజన రైతుల భూముల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బినామి అక్రమించుకుంటే అడగడానికి వెళితే ప్రైవేట్ గుండాలతో దాడిచేయించడమే కాకుండా 40 మందిని రెండు నెలల పాటు జైలులో ఎందుకు పెట్టారో సీఎం కేసీఆర్ సమాధానం చెబితే బాగుండేదన్నారు. గిరుజనుల భూముల్లో ప్రైవేటు వ్యక్తి వేసుకున్న షెడ్ తొలగించడానికి గిరిజన యువకులు, వాళ్లకు మద్దతుగా పోయిన బీజేపీ నాయకులపై లాఠీ ఛార్జీ చేసి కేసుల పెట్టిన విషయాన్ని రైతులు అంత సులువుగా మరచిపోతారా అని అన్నారు.

నాగార్జున సాగర్ SLBC టన్నెల్ ను తాను కుర్చీవేసుకుని కూర్చొని పూర్తి చేయిస్తానని 6 ఏళ్ల కిందటే కేసీఆర్ చెప్పిన విషయాన్ని సంజయ్ గుర్తుచేశారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్ కుర్చీ దొరకలేదా అని ప్రశ్నించారు. చేసిన పనికి నిధులు రిలీజ్ చేస్తే కేవలం ఏడాదిలో పూర్తి చేస్తానని SLBC టన్నెల్ వర్క్ చేస్తున్న కంపెనీయే చెబుతుంటే… నిధులు ఇవ్వక దాన్ని పూర్తికాకుండా అడ్డుపడుతున్నది స్వయంగా కేసీఆరే అని అన్నారు. త్వరలో డిండి పూర్తవుతుందని చెబుతున్న కేసీఆర్, దానికి ఎగువన ఉన్న నక్కలగండి ఎప్పుడు పూర్తవుతుంది, శివన్నగూడెం ఎప్పుడు పూర్తవుతుందో ముందుచెప్పాలని డిమాండ్ చేశారు సంజయ్. ఒక్కమాటలో చెప్పాలంటే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ ఆరేళ్లలో అదనంగా ఒక్క ఎకరానికి నీళ్లివ్వని ఈ సర్కార్… ఉప ఎన్నికలు రాగానే తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో 2004 నుంచే మంచినీళ్లువస్తున్నాయని, టీఆర్ఎస్ సర్కార్ వచ్చి కొత్తగా చేసిందేమి లేదన్నారు. నాగార్జున సాగర్ లోని విజయపురిలోనే ఇప్పటికి ఇంటింటికి రోజూ నీళ్లు సరఫరా కాకపోవడం కంటే ఇంకేమైనా దౌర్భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్న 3 లక్షలకు పైగా ఉన్న బత్తాయి రైతుల ప్రస్తావన కూడా చేయలేదన్నారు సంజయ్. పక్కనే ఉన్న పెదఊరలో మూత పడ్డ పళ్లతోటల పరిశోధన కేంద్రం గురించి కేసీఆర్ కు కనీస అవగాహన కూడా లేదన్నారు.

ఇంటింటికి మిషన భగీరథ ద్వారా మంచినీళ్లివ్వకపోతే 2018 ఎన్నికల్లో ఓట్లే అడగనన్న వ్యక్తి రాష్ట్రంలో సగం గ్రామాలకు కూడా నీళ్లు రాకున్నా ఏ మొహం పెట్టుకుని ఓట్లడిగారాని ప్రశ్నించారు బండి సంజయ్. ఇప్పటికీ రాష్ట్రంలో చాలా గ్రామాలకు నీళ్లు రావట్లేదని గుర్తుచేశారు.

ఎన్నికలు, ఓట్లకోసం కేసీఆర్ ఎన్ని అనైతిక పనులైనా చేస్తారన్నారు సంజయ్. 3 ఏండ్ల కిందట నాగార్జున సాగర్ లో 250 మంది గొల్ల కురుమలు, యాదవులు తలా రూ.31 వేలు కడితే… ఉపఎన్నికలున్నాయని ఇప్పుడు గొర్రెలిచ్చారన్నారు. ఈ మూడేండ్లు యాదవ సోదరులు అప్పుతెచ్చుకున్న ఆ డబ్బులకు వడ్డీకూడా కేసీఆరే ఇస్తే బాగుంటుందన్నారు. ఆ జిల్లా మంత్రి ఆదేశాలతో కృష్ణా నదిపై  అటు – ఇటూ రీ సైకిల్ అన్న గొర్రెల లెక్కలు కూడా తీయాలన్నారు.

పోడు భూముల సమస్యలు, ఎస్టీ రిజర్వేషన్ ను ప్రశ్నిస్తే కుక్కలని సంబోధిస్తావా అంటు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. గిరిజనులపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్న సీఎం దమ్ముంటే ముందుగా వాళ్లకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తవాళ్లకు ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు రావాలంటే ఆ నియోజక వర్గంలో బైఎలక్షన్ రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఇటీవల దుబ్బాకలో ఉప ఎన్నికలు వస్తేనే అక్కడ కొత్తవాళ్లకు పెన్షన్, రేషన్ కార్డులు ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఇస్తామని చెబుతున్నారు. రాష్ట్రాన్ని పాలించే సీఎం ఇంత నీచానికి దిగజారడం దురదృష్టకరమన్నారు. సీఎం చెప్పిన కల్లిబొల్లిమాటలను నాగార్జున సాగర్ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని, దుబ్బాకలో ఇచ్చిన తీర్పునే ఇక్కడ కూడా ఇస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు.