హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ ఆదివారం చేపట్టిన ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 285 దరఖాస్తులు అందాయి.
ప్రధానంగా ఆస్తి పన్నుల్లో హెచ్చు తగ్గులు, విస్తీర్ణం నమోదులో తప్పులు, మ్యుటేషన్ వంటి సమస్యలపై ప్రజలు అధికారులను ఆశ్రయించారు. డిప్యూటీ కమిషనర్లు, వాల్యుయేషన్ అధికారులు స్వయంగా దరఖాస్తులను స్వీకరించి, నిబంధనల మేరకు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం (మార్చి 8, 15, 22, 29 తేదీల్లో) అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
