చివరి క్షణంలో ‘సర్ ప్రైజ్’ దాడి

చివరి క్షణంలో ‘సర్ ప్రైజ్’ దాడి

టెహ్రాన్/వాషింగ్టన్: ఖమేనీని తుదముట్టించడమే లక్ష్యంగా అమెరికా సాయంతో ఇజ్రాయెల్ దాడులు జరిపింది. అయితే, దాడి జరపడానికి ఎంచుకున్న సమయాన్ని చివరి నిమిషంలో మార్చేసినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఖమేనీ ఇరాన్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం కానున్నారనే సమాచారం ఇజ్రాయెల్ కు అందింది. ఈ మీటింగ్ ను ఖమేనీ శనివారం ఉదయానికి మార్చేశారు. అధికారులతో భేటీ తర్వాత ఖమేనీ అండర్ గ్రౌండ్ లోని బంకర్ లోకి వెళ్లిపోతారని అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు అప్రమత్తమయ్యాయి. 

ఖమేనీకి తప్పించుకునే ఛాన్స్ ఇవ్వొద్దని తమ ఆపరేషన్ ను కూడా ఉదయానికి మార్చుకున్నాయి. ఖమేనీతో పాటు ఇరాన్ సైనిక మరియు నిఘా విభాగాల కీలక నేతలందరూ ఒకే చోట ఉన్న ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకూడదని భావించాయి. వాషింగ్టన్ లో అర్ధరాత్రి సమయం (ఇరాన్ లో ఉదయం) లో డొనాల్డ్ ట్రంప్ దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అమెరికా బలగాలు టెహ్రాన్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఖమేనీ నివాసంపై క్షిపణులను ప్రయోగించాయి. 

కాగా, తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటిస్తూ, ఇరాన్ తన పవిత్ర జామ్‌కరాన్ మసీదుపై 'ప్రతీకారానికి గుర్తుగా ఎర్ర జెండా' ఎగురవేసింది. షియా సంప్రదాయం ప్రకారం ఈ జెండా శత్రువుపై యుద్ధ ప్రకటనకు మరియు చిందిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామనే హెచ్చరికకు సంకేతం.