మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం సాయికుంటలోని ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ గేట్ ఎదుట విద్యార్థులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో 120 మంది స్టూడెంట్స్ ఉన్నామని, రెగ్యులర్ వార్డెన్లు లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉదయం 4 గంటలకే విద్యార్థులను నిద్రలేపి వారితో కూరగాయలు కట్ చేయించడం, వంటలు చేయించడం, గదులు క్లీన్ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫుడ్ సరిగా పెట్టడం లేదని అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, కూరలు నీళ్లలాగే ఉంటున్నాయని వాపోయారు. వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడంతో ఎలర్జీలు వస్తున్నాయని తెలిపారు. సమస్యలను సోషల్ వెల్ఫేర్ డీడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని సెక్షన్ అధికారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం..
సాయికుంట ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ సమస్యలను పరిష్కరిస్తామని బీసీ వెల్ఫేర్ డీడీ భాగ్యవతి హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చేయడంతో ఆమె హాస్టల్ ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
