హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రగ్బీ ఆటను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు రగ్బీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నడుం బిగించింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నరేంద్ర రామ్ అధ్యక్షతన హైదరాబాద్‌లో ఆదివారం వార్షిక సర్వసభ్య సమావేశం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. 16 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్న ఏజీఎంలో నరేంద్ర రామ్ ఏడాది కాలానికి డెవలప్‌మెంట్ క్యాలెండర్‌ను విడుదల చేశారు.
స్కూల్స్, కాలేజీ లెవెల్స్‌లో ప్లేయర్ల భాగస్వామ్యాన్ని పెంచడం, డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీలను పెంచడం ఈ ప్లాన్‌లో కీలక అంశాలుగా ఉన్నాయి. జిల్లాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి, క్రమం తప్పకుండా ట్రెనియింగ్ క్యాంప్స్ నిర్వహించాలని, స్టేట్, నేషనల్ లెవెల్ పోటీల్లో తెలంగాణ ప్లేయర్లు రాణించేలా తగిన వసతులు కల్పించాలని ప్రతినిధులు తీర్మానించారు.
