శ్రీశంకర్‌‌‌‌ ‘అద్వితీయం’.. లాంగ్‌‌ జంప్‌‌లో సిల్వర్‌‌.. కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో వరుసగా రెండో మెడల్‌‌

శ్రీశంకర్‌‌‌‌ ‘అద్వితీయం’.. లాంగ్‌‌ జంప్‌‌లో సిల్వర్‌‌.. కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో వరుసగా రెండో మెడల్‌‌
  • పారా అథ్లెటిక్స్‌‌లో స్వర్ణం, రజతం
  • జావెలిన్‌‌ ఫైనల్లో నీరజ్‌‌ బృందం

గ్లాస్గో: ఇండియా స్టార్‌‌ లాంగ్‌‌ జంపర్‌‌ మురళీ శ్రీశంకర్‌‌.. కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాత్రి జరిగిన మెన్స్‌‌ లాంగ్‌‌ జంప్‌‌ ఫైనల్లో శ్రీశంకర్‌‌ 8.09 మీటర్ల దూరం దూకి సిల్వర్‌‌ మెడల్‌‌ను సాధించాడు.

దాంతో మెగా గేమ్స్‌‌లో  వరుసగా రెండో పతకం సాధించిన తొలి ఇండియన్‌‌ లాంగ్‌‌ జంపర్‌‌గా రికార్డులకెక్కాడు. 2022 బర్మింగ్‌‌హామ్‌‌ గేమ్స్‌‌లోనూ శ్రీ రజతం సాధించాడు. తజే గేల్‌‌ (జమైకా, 8.15 మీటర్లు), స్టీఫెన్‌‌ మాకెంజీ (స్కాట్లాండ్‌‌, 8.08 మీటర్లు) వరుసగా గోల్డ్‌‌, బ్రాంజ్‌‌ కైవసం చేసుకున్నారు.

ఇండియాకే చెందిన లోకేశ్‌‌ సత్యనాథన్‌‌ (7.97 మీటర్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గతంలో కామన్వెల్త్‌‌ లాంగ్‌‌ జంప్‌‌లో సురేశ్‌‌ బాబు, అంజు బాబీ జార్జ్‌‌, ఎం. ప్రజుష మాత్రమే ఇండియాకు మెడల్స్‌‌ అందించారు.

ఊతకర్రల నుంచి మెడల్‌‌ వరకు..
2024 ఏప్రిల్‌‌లో పాలక్కాడ్‌‌లోని ఓ సాధారణ ట్రెయినింగ్‌‌ సెషన్‌‌లో జరిగిన వింత ఘటనలో శ్రీశంకర్‌‌ ఎడమ మోకాలి చిప్పకు దెబ్బ తగిలింది. దాంతో పటెల్లార్‌‌ టెండన్‌‌ చిట్లిపోయింది. వెంటనే హాస్పిటల్‌‌కు తీసుకెళ్లగా డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. 

అయితే ఆపరేషన్‌‌ సక్సెస్‌‌ అయినా పరుగెత్తడం సాధ్యం కాకపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో శ్రీశంకర్‌‌తో పాటు అతని తండ్రి కాసింత నిరాశకు గురయ్యారు. సర్జరీ తర్వాత రిహాబిలిటేషన్‌‌ కారణంగా 2024 పారిస్‌‌ ఒలింపిక్స్‌‌తో పాటు ఆ సీజన్‌‌ మొత్తానికి దూరమయ్యాడు. దాదాపు 650 రోజులు పోటీలకు దూరంగా ఉన్నాడు.

అయితే ఒలింపిక్స్‌‌ పక్కనబెడితే కనీసం తన కుమారుడు ఊతకర్రల సాయం లేకుండా నడవాలని మాత్రమే తాను కోరుకున్నట్లు శ్రీశంకర్‌‌ తండ్రి మురళీ వెల్లడించాడు. కానీ లాంగ్‌‌ జంప్‌‌ దాదాపు అసాధ్యమే అనుకున్న తరుణంలో శ్రీశంకర్‌‌ మాత్రం అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఆరంభంలో కొద్దికొద్దిగా దూకడం ప్రారంభించాడు. తర్వాత ఏప్రిల్ 2025లో మూడు మీటర్లు దూకాడు. 

ఆ టైమ్‌‌లో నేను అతన్ని చూడలేకపోయా. నాకు చాలా భయమేసింది. కిందకు దిగిన ప్రతిసారి రీ ఎంట్రీ ఎంత పెళుసుగా ఉంటుందో గుర్తుకువచ్చేది. ప్రతి ట్రెయినింగ్‌‌లోనూ అనిశ్చితితోనే ఉండేది. కానీ శ్రీశంకర్‌‌ మాత్రం చాలా ధృడ సంకల్పంతో అనుకున్నది సాధించాడు’ అని మురళీ పేర్కొన్నాడు.

బంగారు గావిత్‌‌.. రజత బాసిల్‌‌
గ్లాస్గో:  కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో పారా అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. మెన్స్‌‌ 100 మీటర్ల టీ–47 ఫైనల్లో దిలీప్‌‌ మహాదు గావిత్‌‌, మహమ్మద్‌‌ బాసిల్‌‌ స్వర్ణం, రజతం గెలిచి కొత్త చరిత్ర సృష్టించారు. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్లో గావిత్‌‌ 10.71 సెకన్లలో లక్ష్యాన్ని చేరి గేమ్స్‌‌ రికార్డుతో టాప్‌‌లో నిలిచాడు. 

బాసిల్‌‌ 10.83 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో ప్లేస్‌‌ను సొంతం చేసుకున్నాడు. కెవిన్‌‌ సాంటోస్‌‌ (ఇంగ్లండ్‌‌, 10.85 సెకన్లు)కు కాంస్యం లభించింది. టీ–47 పారా అథ్లెటిక్స్‌‌ స్ప్రింట్‌‌.. ఒక వైపు చేయి బలహీనత లేదా లేకపోవడం వల్ల బలం, కదలిక, సమన్వయం దెబ్బతిన్నవారి కోసం ఉద్దేశించబడిన ఈవెంట్‌‌.

విమెన్స్‌‌ 48 కేజీల వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌లో మీరాబాయి చాను, విమెన్స్‌‌ షాట్‌‌ఫుట్‌‌ ఎఫ్‌‌–57 పారా అథ్లెటిక్స్‌‌లో షర్మిలా ధంకర్‌‌ తర్వాత గేమ్స్‌‌లో గవిత్‌‌ సాధించిన స్వర్ణం ఇండియాకు మూడోది కావడం విశేషం. మెన్స్‌‌ ఎఫ్‌‌42–44/ఎఫ్‌‌ 61–64 ఫైనల్లో డిస్కస్‌‌ త్రోయర్లు సాగర్‌‌ తాయత్‌‌, దేవేందర్‌‌ నిరాశపర్చారు.

ఎఫ్‌‌43లో పోటీపడిన సాగర్‌‌ 51.79 మీటర్ల త్రోతో ఆసియా రికార్డును, సీజన్‌‌లో అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసినా పతకం సాధించలేకపోయాడు. ఎఫ్‌‌44లో 10 మంది పోటీదారుల మధ్య దేవేందర్‌‌ 48.20 మీటర్ల దూరం విసిరాడు. 

ఫైనల్లో నీరజ్‌‌
మెన్స్‌‌ జావెలిన్‌‌ త్రోలో ఇండియన్‌‌ అథ్లెట్లు సత్తా చాటారు. ఒలింపిక్‌‌ పతక వీరుడు నీరజ్‌‌ చోప్రాతో పాటు రోహిత్‌‌ యాదవ్‌‌, యశ్‌‌వీర్‌‌ సింగ్‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వాలిఫికేషన్‌‌ రౌండ్స్‌‌లో నీరజ్‌‌ ఈటెను 79.16 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. రోహిత్‌‌ (78.37 మీటర్లు), యశ్‌‌వీర్‌‌ సింగ్‌‌ (78.36 మీటర్లు) వరుసగా 9, 10వ స్థానం సాధించారు.

మొత్తం 12 మంది అథ్లెట్లు ఫైనల్లోకి అడుగుపెట్టారు. 18 డిగ్రీల సెల్సియస్‌‌ టెంపరేచర్‌‌తో పాటు తీవ్రమైన ఈదురు గాలుల వల్ల త్రోయర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. శ్రీలంక త్రోయర్‌‌ రుమేష్‌‌ తరంగ (82.84 మీటర్లు) క్వాలిఫికేషన్స్‌‌లో టాప్‌‌లో నిలవగా, పాక్‌‌ అథ్లెట్‌‌ అర్షద్‌‌ నదీమ్‌‌ (78.36 మీటర్లు) ఏడో స్థానంతో ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు.

ప్రవీణ్‌‌, ప్రభు ముందంజ
ట్రిపుల్‌‌ జంప్‌‌ విభాగంలో ఇండియా అథ్లెట్లు ప్రవీణ్‌‌ చిత్రవేల్‌‌, సెల్వ ప్రభు ఫైనల్లోకి అడుగుపెట్టారు. క్వాలిఫికేషన్స్‌‌ రౌండ్స్‌‌లో ప్రవీణ్‌‌ తన తొలి ప్రయత్నంలో 16.41 మీటర్ల దూరం దూకి రెండో ప్లేస్‌‌లో నిలిచాడు. సెల్వ ప్రభు తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ చివరి ప్రయత్నంలో 16.26 మీటర్లు దూకి మూడో స్థానంలో నిలిచాడు. మెన్స్‌‌ 400 మీటర్ల పరుగులో విశాల్‌‌ 46.33 సెకన్ల టైమింగ్‌‌తో ఆరో ప్లేస్‌‌తో సరిపెట్టుకున్నాడు.